ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
కుదిరిన ఒప్పందం తాత్కాలికమేనన్న
అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్ : ఇరాన్తో డీల్ తనకు నచ్చకపోయినా ఆ దేశం పద్ధతిగా ప్రవర్తించకపోయినా మళ్లీ బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం పూర్తిగా ఖరారైందా ? అని మీడియా ప్రశ్నించగా అది తుది ఒప్పందం కాదని ట్రంప్ చెప్పారు. అది కేవలం ఒక ప్రాథమిక అవగాహనా ఒప్పందం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం చాలా శక్తిమంతమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ఒప్పందం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదని, దాని వల్ల అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం జోష్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా- ఇరాన్ ఒప్పందంలో భాగంగా పునర్నిర్మాణ నిధుల కింద టెహ్రాన్‌కు 300 బిలియన్ డాలర్లు సమకూర్చే అంశం ఉందని వస్తున్న వార్తలపై ట్రంప్ స్పష్టతనిచ్చారు. అవన్నీ అవాస్తవమని తేల్చి చెెప్పారు. తాము ఇరాన్తో పెట్టుబడి పెట్టడం లేదని, ఆ దేశంతో ఒక్క పైసా కూడా వెచ్చించడం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టాలని గల్ఫ్ దేశాలనూ కోరడం లేదని తెలిపారు. ఒకవేళ ఈ విషయంపై ఇరాన్ ముందుకొస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే, ఇరాన్ ధోరణి ఎలా ఉంటుందో ఒక అవగాహన వచ్చేవరకు కొంతకాలం పాటు ఆ దేశాలు అటువంటి పని చేయకపోవచ్చునని వ్యాఖ్యానించారు.
అది ఇరాన్ తీరుపై ఆధారపడి ఉంటుంది
మరోవైపు, ఇరాన్తో ఒప్పందం పూర్తయిందని, శుక్రవారం ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నట్టు ట్రంప్ ఇదివరకే పేర్కొన్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించి ఇరుపక్షాలు ఇప్పటికే ఒప్పందంపై డిజిటల్ సంతకాలు చేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఇటీవల తెలిపారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక విషయాల గురించి ప్రస్తావించారు. ఇరాన్తో జరిగిన ఒప్పందానికి సంబంధించి ఏదైనా సడలింపులు ఉంటాయా? అని ప్రశ్నించగా, అది ఇరాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. “ఇరానీయులు తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించడానికి చర్యలు తీసుకున్నా, అణ్వాయుధాన్ని తయారు చేయబోమని స్పష్టం చేసినా, ఆంక్షల నుంచి ఉపశమనం ఉంటుంది” అని జేడీ వాన్స్ ఉదహరించారు. మరోవైపు, ఇరాన్కు ఎలాంటి ఆర్థిక రాయితీలు ఇవ్వలేదని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఇరాన్ ఆంక్షల నుంచి ఉపశమనం లభిస్తుందా, స్తంభింపజేసిన ఆస్తులను తిరిగి పొందే అవకాశం ఉందా? అని మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానంగా, ‘డిజిటల్ ఒప్పందాలపై మాత్రమే సంతకాలు జరిగాయి, కానీ ఇంకా ఎలాంటి నిధులు విడుదల కాలేదు’ అని జేడీ వాన్స్ పేర్కొన్నారు. అయితే, ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడి ఉంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి కలిసిపోవడానికి ఇరాన్కు ఇదో మంచి అవకాశమని చెప్పారు.
ఒప్పందంపై ఇజ్రాయిల్ వైఖరి ఎలా ఉంది?
ఇక, అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని, లెబనాన్‌లో సైన్యాన్ని కొనసాగించాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం, ఒప్పందం అమలును క్లిష్టతరం చేస్తుందా అని మీడియా ప్రశ్నించింది. అయితే, ఆ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పడంలో ఉన్న సవాళ్లను జేడీవాన్స్ అంగీకరించారు. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ కూడా కొన్నిసార్లు అస్తవ్యస్తంగా ఉంటుందని చెప్పారు. అది కాల్పులను ఉద్రిక్తం చేయడం లేదా తగ్గించడం, ఆపై అసలు కాల్పులే జరపకపోవడం వరకు వెళుతుందని తెలిపారు. మొత్తం మీద దాదాపు 3 నెలలకు పైగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి బ్రెక్ పడినట్లైంది. శుక్రవారం ఇరుపక్షాలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అయితే, పశ్చిమాసియా సంక్షోభాన్ని ముగించే దశగా చర్చలు జరుగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచ లనం సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు విఫలమైతే, గతంలో లాగే ఇరాన్ సైనిక స్థావరాలు, ఇంధన వనరులపై అమెరికా భారీ దాడులకు దిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తు న్నాయి. అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిపించేం దుకు, ఇరాన్‌ను లొంగదీసుకునే వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఈ తరహా కఠిన వ్యాఖ్యలు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.



