– బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘నీట్ పరీక్షాపత్రం లీక్ అవ్వలేదని ఎన్‌టీఏ చెబుతున్నది. మార్కుల కేటాయింపులో తప్పులు జరిగాయంటున్నది కాబట్టి చెక్ చేసి సరిచేయిస్తాం. అయినా, అభ్యర్థులకు నమ్మకం కుదరకుంటే వారికి రీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అంతేకాని బట్ట కాల్చి మీద వేయొద్దు’ అని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఆరేండ్ల బాలికపై జరిగిన లైగింక దాడిని ఖండించారు. అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నాడని తెలుస్తున్నదనీ, కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని విమర్శించారు. పది రోజుల కిందనే నిందితుడు రైస్‌మిల్లులో చేరినట్టు తెలుస్తున్నదనీ, అక్కడ లేబర్ రికార్డులు కూడా మెయింటెన్ చేయడం లేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో ఉన్నారని ఆరోపించారు. సుల్తానాబాద్ ఘటనలోని నిందితునికి కఠిన శిక్ష విధించాలనీ, బాధిత కుటుంబానికి ఇల్లు, రూ.20 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 8 నెలల్లో పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖల్లో బిల్లులు ఇవ్వడం లేదనీ, స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు కూడా ఇవ్వటం లేదని చెప్పారు.