- విద్యుత్ తీగల పేరుతో పట్టణంలో యథేచ్చగా చెట్ల నరికివేత
- నవతెలంగాణ-రాయికల్
- పర్యావరణ పరిరక్షణ పేరుతో ఒక వైపు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ.. వాటి పెంపకానికి సంవత్సరాల పాటు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న అధికారులు… మరోవైపు అదే మొక్కలు మహా వృక్షాలుగా ఎదిగిన తర్వాత వాటిని నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తున్న ఘటనలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. “మొక్కలు పెడతారు… ఏపుగా పెరిగినాక నరికి వేస్తారు”అంటూ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను విద్యుత్ శాఖ సిబ్బంది నరికివేశారు.కారణం… చెట్ల కొమ్మలు కరెంటు తీగలకు అడ్డుగా వస్తున్నాయట.అయితే, చెట్లను పూర్తిగా తొలగించడం కాకుండా శాస్త్రీయంగా కత్తిరించే మార్గాలు ఉన్నప్పటికీ,వాటిని పాటించకుండా చెట్లను నేలమట్టం చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
వేసవి కాలంలో చెట్లు అందించే నీడ, ఆక్సిజన్,వాతావరణ సౌకర్యం ఎంతో అవసరం.అలాంటి సమయంలో చెట్ల నరికివేత ప్రజలకు మరింత ఇబ్బందులను కలిగిస్తోంది.ఇప్పటికే గంటల తరబడి విద్యుత్ కోతలతో అలమటిస్తున్న ప్రజలు… ఇప్పుడు చెట్ల కోతతో వేడి తీవ్రత మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్న విషయం ఒకటే,“మొక్కలు నాటేటప్పుడు ఉన్న శ్రద్ధ…వాటిని కాపాడేటప్పుడు ఎందుకు ఉండదు?”
పర్యావరణ నిపుణులు చెబుతున్నది ఏమిటంటే,చెట్లు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తే పూర్తిగా నరికివేయడం కాకుండా “ప్రూనింగ్” (కొమ్మల కత్తిరింపు) విధానం పాటించాలి. అలాగే ముందస్తుగా ప్లానింగ్ చేసి చెట్ల పెంపకం చేపట్టాలి.విద్యుత్ లైన్లకు దూరంగా సరైన ప్రదేశాల్లో మొక్కలు నాటితే ఈ పరిస్థితి తలెత్తదని వారు సూచిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,చెట్ల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని,అవసరమైన చోట మాత్రమే శాస్త్రీయ పద్ధతుల్లో కొమ్మలను కత్తిరించాలని ప్రజలు కోరుతున్నారు.లేకపోతే…“పచ్చదనం పేరుతో నాటిన మొక్కలు… కత్తెర కింద పడే భవిష్యత్తు” తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.



