నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించాలి

Immersion celebrations should be conducted with grandeur– భక్తి శ్రద్ధలతో వేడుకలు చేపట్టాలి
– ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – సిరిసిల్ల
ఈ నెల 17 వ తేదీన సిరిసిల్లలో నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిమజ్జనోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సిరిసిల్ల మానేరు తీరంలో చేస్తుండగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయా శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు.  వేడుకలకు ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల సూచనలు మండపాల నిర్వాహకులు, యువత, స్థానిక ప్రజాప్రతినిధులు పాటించి, సహకరించాలని కోరారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ నిబంధన మేరకు సౌండ్ బాక్స్ లు పెట్టుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, వేడుకలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్, సెస్, మత్స్య, పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. కావాల్సిన క్రేన్స్, జేసీబీలు, విద్యుత్ దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని కమిషనర్ ను  ఆదేశించారు. అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి తరలించి, సహకరించాలని కోరారు. మత్స్య శాఖ, అగ్ని మాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని విప్ సూచించారు.
మున్సిపల్ ఆద్వర్యంలో ఏర్పాట్లు..
సిరిసిల్ల మున్సిపల్ ఆద్వర్యంలో నిమజ్జనానికి ఈ నెల 17-09-2024 నుంచి 18-09-2024 వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల మానేరు తీరంలో బారికేడ్లు, టెంట్లు, నీటి వసతి, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, క్రేన్లుకు కలిపి మొత్తం 62 మందిని, 10 మంది ఈతగాళ్ళు, వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం, ప్రతి దానికి సంబంధించి సిబ్బందిని షిఫ్ట్ ల వారీగా నియమించారు. వారి పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారి నియమించారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు, చంద్రంపేట, ముస్టిపల్లి, చిన్న, పెద్ద బోనాల, పెద్దూర్, సర్దాపూర్లో అధికారులను నియమించారు.
జిల్లాలో 2200 విగ్రహాలు…
జిల్లాలో మొత్తం 2200 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 400, వేములవాడ పట్టణంలో 300, ఆయా మండలాలు, గ్రామాల్లో కలిపి మొత్తం దాదాపు 2200 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని, వేడుకలు విజయవంతంగా ముగిసేలా సహకరించాలని కోరారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, ఆర్డీవో రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసిల్దార్ ఎండీ షరీఫ్ మొహియొద్దీన్ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love