– ఢిల్లీ ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ : ఆడ్-ఈవెన్ నెంబర్ కార్ల రేషనింగ్ పథకం సమర్ధతపై సుప్రీం కోర్టు సమీక్షించి ఆదేశాలు జారీ చేసిన అనంతరమే దేశ రాజధానిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం తెలిపింది. సుప్రీం కోర్టు సమీక్ష కోసం ఈ పథకం సమర్ధతను నిర్ణయించేందుకు చికాగో యూని వర్శిటీ ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్, ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీలు రెండు ప్రధానమైన అధ్యయనాలు నిర్వహించాయని, వాటి ఫలితాలను ఢిల్లీ నగర ప్రభుత్వం కోర్టుకు అందచేస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రారు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. వాహనాల కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకం సమర్ధతను సుప్రీం కోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనిపై శుక్రవారం విచారణకు వాయిదా వేసింది.
2016లో ఈ పద్దతిని ప్రవేశపెట్టిన ప్రభావాన్ని చికాగో యూనివర్శిటీకి చెందిన సంస్థ, ఎవిడెన్స్ ఫర్ పాలసీ డిజైన్‌లు విశ్లేషించాయి. ఆ ఏడాది జనవరిలో పథకం అమల్లో వున్న సమయంలో ఢిల్లీలో పిఎం 2.5 లెవల్స్ 14 నుండి 16శాతం తగ్గిందని పేర్కొన్నాయి. అయితే ఆ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి పథకాన్ని అమలు చేసినపుడు కాలుష్యంలో ఎలాంటి తగ్గుదల లేదని పేర్కొంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం యాప్ ప్రాతిపదికన నడిచే టాక్సీలను కూడా నిషేధించామని మంత్రి చెప్పారు. కన్నాట్‌ప్లేస్‌లోని స్మోగ్ టవర్‌ను తిరిగి ప్రారంభించాల్సిందిగా ఢిల్లీ కాలుష్య నియంత్రణా కమిటీని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. అలాగే రాజధానిలో కాలుష్యానికి గల వివిధ కారకాలను గుర్తించేందుకు అధ్యయనాన్ని పునరుద్ధరించేందుకు ఐఐటి కాన్పూర్‌కు మిగిలిన నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో బహిరంగంగా వ్యర్ధాలను తగలబెట్టే వాటిని అడ్డుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం 611 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.