కేతిగాడు : అరె జుట్టుపోలుగా చదువు ఎందుకురా చదివేది?
జుట్టుపోలుగాడు : అదేంది.. ఉద్యోగం చేయడానికి. మంచిగా బతకడానికి.
కేతిగాడు : ఏది ముఖ్యం? మంచిగా బతకడమా? ఉద్యోగం చేయడమా?
జుట్టుపోలుగాడు : ఈ తిరకాసేందిరా?
కేతిగాడు : అవును తిరకాసే. ఇది అర్థమయితే గాని నీవు లైన్లోకి రావు. చదువుకుంటే ఏదో ఒక పని చేసుకుని హాయిగా, గౌరవంగా బతకొచ్చు. చదువు అలాంటి ఆత్మస్థైర్యం ఇవ్వాలి. ఆ చదువు తనకే కాక నలుగురికి ఉపయోగపడాలి.
జుట్టుపోలుగాడు : అవును, అయితే ఏంటి?
కేతిగాడు : మరి చదువు చక్కగా రావాంటే బడులు బాగుండాలి కదా! కాక్రోచ్ జనతా పార్టీవాళ్లు ‘స్కూల్ ఠీక్ కరో’ (బడులు బాగు చేయండి) అని ఉద్యమిస్తుంటే మీ బిజెపి, ఆరెస్సెస్ వాళ్లు గుండాల్లా వాళ్ల మీద దాడులు ఎందుకు చేస్తున్నారు. రాళ్లతో కర్రలతో ఎందుకు కొడ్తున్నారు. రాజస్తాన్ జైపూర్‌లో ఓ సర్కార్ బడిని సిజెపి బృందం తనిఖీ చేయడానికి వెళ్తే ఈ ఘోరం జరిగింది. ఆ బడి ఓ పశువుల కొట్టంలో నడుస్తుంది. అలాగే మహారాష్ట్ర లాతూర్‌లో సిజెపి అధినేత అభిసింగ్ దీప్కేకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాము వస్తున్నామని తెలిసి ఆ జిల్లా పరిషత్ స్కూల్‌కు ఇతర స్కూల్స్ పిల్లలను చేరవేశారని దీప్కే చెప్పాడు.
జుట్టుపోలుగాడు : మావా కేతిగా.. నాకు తెలియక అడుగుతాను, అసలు ఆ స్కూళ్లను తనిఖీ చేసే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు?
కేతిగాడు : అరె నీకు ముతక భాషలో చెప్పాలంటే ‘నీ సంసారం చెడగొట్టకుంటే నేను నీ రంకు మొగుడ్నే కాదన్నాడంట వెనకటికెవడో నీలాంటివాడు. అలా వుందే నీ తంతు. బాలలకు చదువుకునే హక్కు వుందని, ఆ హక్కు అమలు కావాలంటే ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరగాలని, లేకుంటే బాలలు చదువుకు దూరమై తిరిగి పేదరికం బాట పడ్తారని సిజెపి ఈ ఉద్యమం చేపట్టింది. మా ఇష్టం. మా ఊళ్లో బడులు, చదువులు ఇట్టాగే వుంటాయని, పిల్లలకు చదువు రాకపోయినా, సంకనాకిపోయినా సరే అని నీలా మొండిగా వాదించే వాళ్లకు ఎవడేం చెప్తాడు?
జుట్టుపోలుగాడు : కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకురా?
కేతిగాడు : హమ్మయ్య. ఓ మెట్టు దిగావన్నమాట. ఇందాకేమో తనిఖీకి వాళ్లెవరు అన్నావు. ఇప్పుడేమో ఆ ఊరి జనానికి పట్టకపోతే వీళ్లకేంటి? అంటున్నావు. ఇది ప్రజా ఉద్యమంరా. మన పిల్లల చదువు మనందరి బాధ్యతరా. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. గ్రామ పెత్తందార్లు, ఆధిపత్య రాజకీయ నేతలు కులం పేరుతోనో, మతం పేరుతోనో మనలాంటి పేదోళ్ల పిల్లలకు చదువు రాకుండా చేస్తే ఎలా..? దేశంలో 65 శాతం ప్రభుత్వ పాఠశాలలకు మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతుల్లేవు. పాపం ఆ పిల్లలకు చదువెలా వస్తుంది? అందుకే రోజురోజుకు బడిమానేసే పిల్లల (డ్రాప్ అవుట్స్) సంఖ్య పెరిగిపోతున్నది. పి.ఎం. కేర్స్ ఫండ్ (ప్రధాన మంత్రి ప్రత్యేక నిధులు) పిల్లల బడులపై ఖర్చు పెట్టొచ్చుగా అని దీప్కే కోరుతున్నాడు. ఇది సమంజసమేగా. దాదాపు ఎనిమిదిన్నర వేల కోట్లు వున్నాయి. ఆ నిధులతో వేయి స్కూళ్లను చక్కగా బాగు చేయొచ్చు. ఇలా ఎన్నో నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఖర్చు చేయకుండా మురిగిపోతున్నాయి. వీటన్నింటిని పథకం ప్రకారం ఖర్చు చేస్తే దేశంలోని స్కూళ్లు అన్నింటినీ బాగు చేయవచ్చని అతగాడు చెప్తున్నాడు.
జుట్టుపోలుగాడు : నీవు చెప్పేదంతా బాగానే వుంది. మరి మా బిజెపి పాలకులు ఎందుకు అమలు చేయడం లేదు?
బంగారక్క : అద్గదీ. నిద్రపోయేవాళ్లను లేపొచ్చు. నిద్ర నటించేవాళ్లను ఎలా లేపగలం? మీ బిజెపి, ఆరెస్సెస్ పాలకులకు పేద పిల్లల చదువు అంటే అస్సలు లెక్కలేదు. దేశాన్ని అంధకారం వైపు నడిపించే వర్ణాశ్రమ మనుధర్మం వద్దనే వారు ఆగిపోయారు. ఆ ధర్మం అంతా మనుషులను చీల్చేది, ద్వేషాలను రగిల్చేది, యుద్ధాలను సృష్టించేది. రాజ్యం వీరభోజ్యం. వారి దుగ్ద.
దేశ భవిష్యత్తు బడి పిల్లల తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంటుందన్న ప్రాథమిక సత్యాన్నే వారు మరిచిపోయారు. ఎంత సేపు పైన పటారం, లోన లొటారం. దేశంలో దాదాపు 15 లక్షల స్కూళ్లు వుంటే లక్షన్నరకు పైగా స్కూళ్లల్లో సింగిల్ టీచరే. చాలా స్కూళ్లు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతుల్లేక పశువుల కొట్టాల్లోనో, రేకుల షెడ్డుల్లోనో మురికి కూపాలుగా వుంటున్నాయి. ప్రభుత్వాలు తలచుకుంటే మార్పు ఇట్టే వస్తుంది. కాని తీసుకురారు. ఎందుకంటే పిల్లలకు ఓట్లుండవుగా. గుడుల మీద వున్న శ్రద్ధ బడుల మీద వుండదు. మనం కూడా ఆలోచించాలి. ఇదిగో ఇప్పుడు సిజెపి వాళ్లు సర్కార్ బడులపై ఫోకస్ పెట్టి జనాన్ని జాగృతం చేస్తుంటే వాళ్లకి కంపరం పుట్టుకొస్తుంది. అందుకే ఈ దుర్మార్గపు దాడులు. ఆరేళ్ల పిల్లాడ్ని కూడా అరెస్టు చేస్తున్నారు. అయినా సోషల్ మీడియా ప్రతివారి చేతుల్లోకి వచ్చాక వాస్తవాలను ఎవరు దాయగలరు? ఉద్యమకాంతిని అరచేతితో ఎవరు ఆపగలరు?
కె.శాంతారావు, 99597 45723



