పెరిగిన హత్యలు, లైంగికదాడులు

Former Minister Harish– ఇకనైనా కండ్లు తెరవండి.. : ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌ హితవు
– రాష్ట్రంలో పరిస్థితులపై ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో హత్యలు, లైంగికాదాడులు, అఘాయిత్యాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు, హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శమని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కండ్లు తెరవాలంటూ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటనను మరిచిపోకముందే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఎస్‌ఐ… మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత పదేండ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణలో… ఇప్పుడు భయానక పరిస్థితులు నెలకొన్నాయని హరీశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్‌ విద్యపై సర్కారు నిర్లక్ష్యం…
ఇంటర్‌ విద్యపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని హరీశ్‌రావు మరో ప్రకటనలో విమర్శించారు. జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులవుతున్నా ఇప్పటి వరకూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించకపోవటం శోచనీయమని పేర్కొన్నారు. ఇది అత్యంత బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ప్రజా పాలన అని చెప్పుకుంటున్న రేవంత్‌ సర్కార్‌… పేద, బలహీన వర్గాల వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించటంలో విఫలమైందని విమర్శించారు. జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 1,654 గెస్ట్‌ ఫ్యాకల్టీని రెన్యూవల్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్‌ కాలేజీలకు పోస్టులు మంజూరు చేయటం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love