– పరిశ్రమ సామర్థ్యాన్ని మించి గెలల రాక
– ప్లాట్‌ఫాంపై 1,100 టన్నుల నిల్వ..
– క్యూలో 50 వాహనాలు.. తీవ్ర జాప్యంతో రైతులు
– తక్షణమే మరో పరిశ్రమ నిర్మించాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ గెలల దిగుబడి ఏటా పెరుగుతుండగా.. అందుకు అనుగుణంగా క్రషింగ్ సామర్థ్యం పెరగకపోవడంతో రైతులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్ పరిశ్రమకు రోజురోజుకూ పెరుగుతున్న గెలల రాకతో ప్లాట్‌ఫాంపై భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయి.గంటకు 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యం మాత్రమే ఉన్న పరిశ్రమకు ప్రస్తుతం వస్తున్న గెలల పరిమాణం భారంగా మారింది. దీంతో గెలలను పరిశ్రమలోకి తరలించడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.
ప్లాట్‌ఫాంపై 1,100 టన్నులు
వార్త రాసే సమయానికి పరిశ్రమ ప్లాట్‌ఫాంపై సుమారు 1,100 టన్నుల పామాయిల్ గెలలు నిల్వ ఉన్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.మరోవైపు గెలలతో వచ్చిన సుమారు 50 వాహనాలు క్రషింగ్ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రషింగ్‌కు సరిపడా గెలలు ఇప్పటికే నిల్వ ఉండటంతో అదనంగా వచ్చే గెలలను దిగుమతి చేసుకోవడంలో జాప్యం ఏర్పడుతోంది.దీంతో రైతులు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సమయం వృథా కావడంతోపాటు కూలీలకు అదనపు వేతనాలు చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న దిగుబడి:
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని అప్పారావుపేట పరిశ్రమ పరిధిలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు ఉన్నట్లు సమాచారం. ఇందులో సుమారు 50 వేల ఎకరాల నుంచి ఏడాదికి 2.50 లక్షల టన్నుల వరకు పామాయిల్ గెలల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దిగుబడి క్రమంగా పెరుగుతుండటంతో పరిశ్రమపై ఒత్తిడి అధికమవుతోంది.
జూలై 21 నాటికి సుమారు 9 వేల టన్నుల గెలలు రాగా.. ఆగస్టు 21 నాటికే సుమారు 11 వేల టన్నుల గెలలను క్రషింగ్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.దీంతో గతంతో పోలిస్తే గెలల రాక, క్రషింగ్ పరిమాణం గణనీయంగా పెరిగింది.
20 ఏళ్ల కిందటి సామర్థ్యంతోనే:
అశ్వారావుపేట పరిశ్రమను సుమారు 20 ఏళ్ల క్రితం గంటకు 10 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో నిర్మించారు. అనంతరం అదే నమూనాలో సామర్థ్యాన్ని 30 టన్నులకు పెంచారు. అయితే పరిశ్రమలోని యంత్రాలు, ఇతర భాగాలకు కాలక్రమేణా వృద్ధాప్యం రావడంతో తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.దీంతో క్రషింగ్ సామర్థ్యం కూడా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఇబ్బందులను అధిగమించడంతోపాటు నాణ్యమైన ముడి పామాయిల్ ఉత్పత్తి చేయాలంటే పెరుగుతున్న గెలల దిగుబడికి అనుగుణంగా అధిక సామర్థ్యంతో కొత్త పరిశ్రమ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు నాయకులు, ఆయిల్‌ఫెడ్ నిపుణులు పేర్కొంటున్నారు.
అప్పారావుపేట పరిశ్రమకు ఫ్రూట్ తరలిస్తున్నాం: మేనేజర్ కార్తీక్
రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొంత ఫ్రూట్‌ను దమ్మపేట మండలం అప్పారావుపేట పరిశ్రమకు తరలిస్తున్నట్లు అశ్వారావుపేట పరిశ్రమ మేనేజర్ కార్తీక్ తెలిపారు. గెలల దిగుబడి అధికం కావడం, నెల చివరి వారంలో రైతులు పెద్ద మొత్తంలో గెలలను సేకరించి తీసుకురావడంతో పరిశ్రమపై అదనపు ఒత్తిడి పడుతోందన్నారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని పరిశ్రమ వర్గాలకు సహకరించాలని కోరారు.
తక్షణమే నూతన పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి: కొక్కెరపాటి పుల్లయ్య
పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు అందుకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్ చేశారు. పెరుగుతున్న గెలల దిగుబడికి అనుగుణంగా అశ్వారావుపేటలో అధిక సామర్థ్యంతో మరో నూతన పరిశ్రమ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. కొత్త పరిశ్రమ అందుబాటులోకి వస్తే గెలల దిగుమతిలో జాప్యం తగ్గడంతోపాటు రైతులు, వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.



