– 3-2తో అమ్మాయిల మెరుపు విజయం
– హాంగ్‌కాంగ్‌పై అబ్బాయిల గెలుపు
– ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్
షా ఆలమ్ (మలేషియా) : బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్‌లో మన అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. ఒత్తిడిలేని గ్రూప్ దశ మ్యాచ్‌లో అగ్ర జట్టు చైనాను చిత్తు చేశారు. మహిళల గ్రూప్-డబ్ల్యూలో భారత్, చైనా రెండు జట్లే ఉన్నాయి. దీంతో ఇరు జట్లకు నాకౌట్ బెర్త్‌లు ఖాయం. అయినా, ఏకైక గ్రూప్ దశ మ్యాచ్‌లో అమ్మాయిలు చెలరేగారు. మోకాలి గాయం నుంచి కోలుకున్న పి.వి సింధు వరుస గేముల్లో విజయంతో సత్తా చాటింది. సింధు 21-17, 21-15తో హన్ యెవపై గెలుపొందగా.. తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్ప జంట 19-21, 16-21తో నిరాశపరిచింది. అష్మిత చాలిహ 13-21, 15-21తో వాంగ్ జి యి చేతిలో ఓడింది. మూడు గేముల అనంతరం భారత్ 1-2తో వెనుకంజ వేసింది. ట్రెసా జాలి, గాయత్రి జంట 10-21, 21-18, 21-17తో లి జింగ్, షి మిన్‌లపై పైచేయి సాధించింది. ఆఖరు గేమ్‌లో అండర్‌డాగ్ అన్మోల్ ఖార్బ్ 22-20, 14-21, 21-18తో అసమాన విజయం నమోదు చేసింది. 3-2తో చైనాను చిత్తు చేసిన భారత్ విజయంతో నాకౌట్‌కు చేరుకుంది.
మెన్స్ విభాగంలో భారత్ 4-1తో హాంగ్‌కాంగ్‌పై గెలుపొందింది. తొలి గేమ్‌లో ప్రణరు 18-21, 14-21తో నిరాశపరిచినా.. వరుసగా నాలుగు గేముల్లో భారత్ పైచేయి సాధించింది. సాత్విక్, చిరాగ్ జోడి 21-16, 21-11తో, అర్జున్, ధ్రువ్ జోడి 21-12, 21-7తో గెలుపొందగా.. లక్ష్యసేన్ 21-14, 21-9తో, కిదాంబి శ్రీకాంత్ 21-14, 21-18తో విజయాలు నమోదు చేశారు. గ్రూప్-ఏలో నేడు మరో మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడనుంది.