– సాల్వే ఫీజు వివరాలు చెప్పం : రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి లోకేష్ బత్రాకు ఎస్‌బీఐ సమాధానం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లకు సంబంధించి గత నెల 21వ తేదీన ఈసీకి అందజేసిన సమాచారాన్ని ఇవ్వడం కుదరదని రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి లోకేష్ బత్రాకు ఎస్‌బీఐ తేల్చి చెప్పింది. సమాచార చట్టంలోని కొన్ని మినహాయింపులను ఇందుకు కారణంగా చూపింది. మార్చి 11న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బ్యాంక్ తరఫున వాదనలు విన్పించిన న్యాయవాది హరీష్ సాల్వేకు ఎంత మొత్తం ఇచ్చిందీ తెలిపేందుకు కూడా ఎస్‌బీఐ నిరాకరించింది. ఎన్నికల బాండ్లపై సమాచారాన్ని అందజేసేందుకు తనకు మరో మూడు నెలల సమయం కావాలంటూ ఎస్‌బీఐ సమర్పించిన దరఖాస్తును సుప్రీంకోర్టు ఆ రోజు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్, ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్య జారీ చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 21న కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎస్‌బీఐ అందజేసింది. అదే రోజు ఆ సమాచారాన్ని ఈసీ తన వెబ్‌సైటులో ఉంచింది. ఈసీకి ఇచ్చిన సమాచారాన్ని తనకు అందించాలంటూ బత్రా ఎస్‌బీఐని కోరారు. అయితే ఆ సమాచారం ఆర్‌టీఐ చట్టంలోని మినహాయింపుల కిందికి వస్తుందని బుధవారం బత్రాకు రాసిన లేఖలో ఎస్‌బీఐ తెలియజేసింది. ‘మీరు కోరిన సమాచారం కొనుగోళ్లు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వివరాలతో కూడినది. అయితే అది విశ్వసనీయమైనది. ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1) (ఈ), (జే) ప్రకారం దానిని బహిర్గతం చేయకూడదు’ అని ఎస్‌బీఐ ఆ లేఖలో వివరించింది. దీనిపై బత్రా వ్యాఖ్యానిస్తూ సమాచారాన్ని నిరాకరించడం విచిత్రంగా ఉన్నదని చెప్పారు.