నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కార్మికుల పాలిట మరణ శాసనం లా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. గురువారం గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని ఒకరోజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. కార్మికులకు ప్రమాద భీమా, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని, కారోబార్, బిల్ కలక్టర్ లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు పది లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన నిరవధిక సమ్మె సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా, నిరవధిక సమ్మె సందర్భంగా కార్మికుల టెంట్ ల దగ్గరకు వచ్చి పై సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలు ఈ కాలంలో పరిష్కరించలేదని అన్నారు.
ముఖ్యమంత్రి మొదలు మంత్రి సీతక్క, కమీషనర్ తదితరులకు గత 11 నెలల కాలంలో పదుల సంఖ్యలో కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఒక రోజు సమ్మె చేశామని, కలక్టరేట్ ల ముందు సుమారు ఆరు సార్లు ధర్నాలు చేశామని, చివరికి హైద్రాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశామని అన్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని అన్నారు. మంత్రిని కలిసిన ప్రతి సందర్భంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం తో కీర్తించబడిన గ్రామ పంచాయతీ వర్కర్లకు పేరు మాత్రమే మిగిలిందని అన్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కార్మికులు మార్పు కోరి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుంటే, అంతకంటే దుర్మార్గంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
సమస్యల పరిష్కారంలో తీవ్ర వివక్ష
విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మరణించిన, గాయ పడిన కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వడం లేదని వాపోయారు. వయసు ఐపోయిందనే పేరుతో కార్మికులను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కుల గణన సర్వే లో సైతం గ్రామ పంచాయతీ కార్మికులను ఉపయోగిస్తున్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, జిల్లాలో మూడు నుండి ఎనిమిది నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయని అన్నారు. ప్రతి పనికి గ్రామ పంచాయతీ కార్మికుడు అవసరమైన ప్రభుత్వానికి కార్మికుడి కుటుంబం, కనీస వేతనం, ప్రమాద భీమా తదితర సమస్యల పరిష్కారంలో తీవ్ర వివక్ష చూపుతున్నదని అన్నారు. ఇదే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే నవంబర్ 20 తర్వాత ఏ క్షణమైనా సమ్మె లోకి వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి.గంగన్న, దుబాక రమక్క, నర్సమ్మ టి.గంగన్న, జిల్లా నాయకులు వాగారావ్, రఫీ, గంగయ్య, దేవుసింగ్, రాజు, వీలాష్, ప్రకాష్, సంతోష్, సూర్య పాల్గొన్నారు.