ఇరాన్‌-పాకిస్థాన్‌ పరస్పర దాడులు!

ఉగ్రవాదాన్ని అణిచేపేరుతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణా మాలు ఎటుదారి తీస్తాయో అన్న ఆందోళన ప్రపంచ ప్రత్యేకించి మధ్య ప్రాచ్య, పశ్చిమాసియా దేశాల్లో తలెత్తుతోంది. ఎమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లపై ఉగ్రవాదముద్రను తొలగించిన అమెరికా పునరుద్దరించటమేగాక అణచివేసేం దుకు దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది. ఇరాక్‌, సిరియాల్లో అమెరికా, ఇతర పశ్చిమదేశాల మద్దతుతో తమకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న తీవ్రవాద సంస్థలు, ఇజ్రాయిల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్‌ పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావ రాలపై మంగళవారం నాడు క్షిపణి, డ్రోన్ల దాడులు చేసింది. దానికి ప్రతిగా గురువారం ఉదయం ఇరాన్‌లోని తమ వ్యతిరేక ఉగ్రవాదులపై ఆపరేషన్‌ మార్గ్‌ బార్‌ సర్మాచార్‌ పేరుతో దాడులు చేసి అనేక మందిని హతమార్చినట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాలకు వెళ్లిన పాక్‌ తాత్కాలిక ప్రధాని అన్వరుల్‌ హక్‌, విదేశాంగ మంత్రి జలీల్‌ అబ్బాస్‌ జలీల్‌ తమ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ఇస్లామాబాద్‌ తిరిగి వచ్చారు. తమ గగనతలాన్ని అతిక్రమించి భూ భాగం మీద దాడి చేసినందుకు నిరసనగా టెహరాన్‌లోని తమ రాయబారిని వెనక్కు పిల వటంతో పాటు ఇరాన్‌ రాయబారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
గురువారం తెల్లవారుజామున ప్రతిదాడులు చేసింది. ఇరు దేశాలూ సంప్ర దించుకొనేందుకు అనేక మార్గాలుండగా దానికి భిన్నంగా అంతర్జా తీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్‌ దాడులకు పాల్పడిందని పాకిస్థాన్‌ ఆరోపించింది. ఇరాన్‌-పాకిస్థాన్‌- ఆఫ్ఘనిస్తాన్‌ మూడూ కలిసే ప్రాంతంలో బెలూచీ, పుష్తు భాష మాట్లాడే జనాభా ఉన్నారు. మూడు దేశాల్లోనూ ఆ ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ నుంచి బెలూచిస్తాన్‌ వేర్పాటును కోరుతున్న రెండు సంస్థలు ఇరాన్‌ కేంద్రంగా సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. అదే విధంగా ఇరాన్‌లోని బెలూచిస్తాన్‌ ప్రాంతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఇటు పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్నాయి.రెండు దేశాల మధ్య తొమ్మిది వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గతంలో అనేక సందర్భాలలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, చిన్నా పెద్ద ఉదంతాలు కూడా జరిగాయి.ఇరాన్‌లో విద్రోహచర్యలు సాగించేందుకు అమెరికా సాయం పొందుతున్న శక్తులు పని చేస్తున్న సంగతి, దానికి పాకిస్థాన్‌ ఆశ్రయంగా మారిన అంశం బహిరంగ రహస్యమే. దానికి పోటీగా ఇరాన్‌ బెలూచీ వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తూ దెబ్బకు దెబ్బతీస్తున్నది.
ఇటీవల పాకిస్థాన్‌లోని జైయిష్‌ అల్‌ అదిల్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఇరాన్‌లోని సిస్టాన్‌-బెలూచిస్తాన్‌ ప్రాంతంలోని రాస్క్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి పదకొండు మంది భద్రతా సిబ్బందిని బలిగొ న్నారు. అంతకు ముందు జనవరిలో పాకిస్థాన్‌లో ఇరాన్‌ ఉగ్రవాదులు దాడిలో ముగ్గురు మరణించారు. ఇంతకు మించి పెద్ద ఉదంతాలు ఇటీవలి కాలంలో జరగలేదు. దవోస్‌లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు మాట్లా డుకోవటం, హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌-పాకిస్థాన్‌ నౌకాదళ సంయుక్త విన్యా సం జరిపిన మరుసటి రోజే ఇరాన్‌ దాడికి పూనుకోవటాన్ని పాకిస్థాన్‌ ఊహిం చని కారణంగానే రాయబారుల బహిష్కరణ వంటి తీవ్ర చర్యలకు పూనుకుంది. ఇద్దరు విదేశాంగ మంత్రులూ ఇతర అంశాలతో పాటు ఉగ్రవాదనిరోధం గురించి మాట్లాడుకున్నట్లు కూడా ఇరాన్‌ మీడియా పేర్కొన్నది. ఇంతలోనే ఈ పరిణామాల వెనుక బలమైన కారణం ఏమిటన్నది వెంటనే అంతుబట్టటం లేదు. ఇది రెండు దేశాల వ్యవహారమంటూ వ్యాఖ్యానించిన మన దేశం ఉగ్ర వాదాన్ని ఏమాత్రం సహించదని, ఆత్మరక్షణ కోసం దేశాలు తీసుకొనే చర్యలను అర్ధం చేసుకోగలమని పేర్కొన్నది.రెండు దేశాలు సంయమనం పాటించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలను కాపాడాలని చైనా హితవు చెప్పింది. ఇరాన్‌ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. గత కొద్దిరోజులూ ఇరుగుపొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తున్నదని ఆరోపించింది.
ఉగ్రవాది బిన్‌లాడెన్‌ పట్ల ఎవరూ సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. కానీ అతన్ని పెంచి పోషించి అనేక దేశాల మీదకు ఉసిగొల్పిన అమెరికాకే ఏకుమేకుగా మారటంతో 2011 మే రెండవ తేదీన పాకిస్థాన్‌లోని అబొత్తాబాద్‌లో నాటి పాక్‌ ప్రభుత్వానికి ఏమాత్రం తెలుపకుండా మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు సార్వభౌమత్వం గురించి ఇతరులకు సుభాషితాలు చెప్పటానికి దానికి ఉన్న నైతిక హక్కేమిటన్నది ప్రశ్న. రెండు దేశాలూ వివాదాన్ని ముదరకుండా చూసుకోవటం వాటితో పాటు అందరికీ మంచిది.

Spread the love