లెబనాన్, గాజాలపై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా మంగళవారం నాడు క్షిపణులతో జరిపిన తమ దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయిల్ వైపు నుంచి దాడులు కొనసాగితే తాము మరింత గట్టిగా స్పందిస్తామని పేర్కొన్నది. తమ శత్రువు మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ సేనలు లెబనాన్‌లో ప్రవేశించి దాడులను కొనసాగిస్తున్నాయి. వేలాది మంది నివాసాలు వదలి వెళ్లాలని ప్రకటించాయి. దాడులను తిప్పికొడుతున్న హిజబుల్లా ప్రకటించింది. బుధవారం నాడు కూడా దాడులు కొనసాగాయి. అటు ఇజ్రాయిల్, ఇటు లెబనాన్‌లో జరిగిన నష్టాల వివరాలు వెల్లడికాలేదు. ఇజ్రాయిల్‌పై జరుగుతున్న క్షిపణి దాడులను అడ్డుకోవాలని అమెరికా మధ్యప్రాచ్యంలో తిష్టవేసిన తన సేనలను అమెరికా ఆదేశించింది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ ప్రకటించింది. తాజా పరిణామాలతో ప్రామాణిక బ్రెంట్ రకం ముడి చమురు అక్టోబరు ఒకటిన 70.4 డాలర్లుగా ఉన్నది రెండోతేదీన 74.78డాలర్లకు పెరిగింది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
గత శనివారం నాడు లెబనాన్‌లోని హిజబుల్లా పార్టీ నేత హసన్ నస్రల్లాతో పాటు మరికొందరిని ఇజ్రాయిల్ హత్య చేసింది.సెప్టెంబరు 23 నుంచి ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో సోమవారం నాటికి 923 మరణించారని, 2,715 మంది గాయపడినట్లు ప్రకటించింది.1992లో హిజ్‌బుల్లా బాధ్యతలను స్వీకరించిన నస్రల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతకుముందు నేతగా ఉన్న అబ్బాస్ ముసావీని కూడా ఇజ్రాయిల్ ఇదే విధంగా హత్య చేసింది.1997లో జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో నస్రల్లా పెద్ద కుమారుడు హడీ మరణించాడు. 2006లో ఇజ్రాయిల్‌తో జరిపిన 33 రోజుల పోరులో నస్రల్లా నాయకత్వంలో సాధించిన విజయంతో పలుకుబడి పెరిగింది. తాజా హత్యలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా సామ్రాజ్యవాద దుష్టత్వాన్ని మరోమారు ప్రపంచానికి వెల్లడించింది. అది అందచేసిన సమాచారం, విద్రోహుల కారణంగానే ఇరాన్, ఇరాక్, లెబనాన్‌లలో తమ వ్యతిరేకులను ఇజ్రాయిల్ హతమార్చుతోంది. అమెరికా అండ చూసుకొని గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకిస్తున్న ఇరుగుపొరుగు దేశాలన్నింటి మీదా తెగబడుతోంది. ఈ పూర్వరంగంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కలిగి స్తున్నాయి. లెబనాన్‌పై ప్రత్యక్షదాడి వెనుక కారణాలేమిటన్నది ఆసక్తి కలిగించే అంశం. యుద్ధం చెలరేగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారటం ఖాయంగా కనిపిస్తోంది. లెబనాన్ తరువాత ఎమెన్ మీద దాడులకు దిగవచ్చని చెబుతున్నారు. ఈ నెల ఏడోతేదీ నాటికి గాజాలో మారణకాండకు ఏడాది నిండ నుంది, ఆ తరువాత పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ చెప్పలేము. గడచిన రెండు నెలల కాలంలో ఇజ్రాయిల్ చేసిన హత్యలు, దాడుల గురించి ఇరాన్, సిరియా, హమాస్, హిజబుల్లా తక్కువ లేదా తప్పుడు అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోందన్న కొందరి విశ్లేషణలను కొట్టిపారవేయలేము. అందుకే వ్యూహాలను తిరిగి రచించుకొనేందుకు కొంతవ్యవధి పట్టవచ్చు.
మధ్యప్రాచ్య పరిణామాలు భారత్‌తో సహా అనేక దేశాల మీద ఆర్థిక ప్రభావాలు చూపుతాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్నది వాటిలో ఒకటి.1973లో ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా చమురు ఉత్పత్తి దేశాలు చము రును ఒక అస్త్రంగా ఉపయోగించాయి. దానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా, జపాన్, కెనడా, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చమురు ఎగుమతులను నిలిపివేశాయి. దాంతో పీపా ధర మూడు నుంచి 11 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పెరుగుదల, దానితో పాటు ఆర్థిక వ్యవస్థల కుదేలు జరగవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఎమెన్‌లోని హౌతీలు జరుపుతున్న దాడులతో ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాకు ఆటంకం కలుగుతూ ఆఫ్రికా గుడ్‌హోప్ ఆగ్రం చుట్టూ తిరిగి రావటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. గతేడాది అగస్టు పదకొండవ తేదీతో ముగిసిన వారంలో 70 ఓడలు ఎర్ర సముద్రం బాబ్ అల్ మండాబ్ జల సంధి గుండా ప్రయాణించగా ఈ ఏడాది అదే వారంలో కేవలం 23 మాత్రమే వచ్చినట్లు ఐఎంఎఫ్ రేవుల విభాగం గుర్తించింది. పరిసర దేశాల్లోని చమురు క్షేత్రాలు, శుద్ధి కేంద్రాల మీద దాడులు జరిగితే సంక్షోభం తలెత్తవచ్చు. చరిత్ర పునరావృతం కావచ్చు గానీ ఒకే విధంగా జరుగు తుందని చెప్పలేము.ఈ కారణంగానే భిన్న దృశ్యాలతో రాగల పరిణామాలను అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరు ఏడవ తేదీన హమాస్‌దాడులు, ఆ పేరుతో ఇజ్రాయిల్ ప్రారంభించిన మారణకాండ పర్యవసానాల గురించి ప్రపంచ బ్యాంకు మూడు అంచనాలు చెప్పింది, వాటినే ఇప్పుడు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వల్ప ఆటంకం (లిబియాలో అంతర్యుద్ధం జరిగిన 2011 ఏడాది మాదిరి) ప్రపంచ చమురు సరఫరాలోలో ఐదులక్షల నుంచి ఇరవై లక్షల పీపాల వరకు రోజుకు తగ్గవచ్చు, చమురు ధరలు మూడు నుంచి 13శాతం పెరగవచ్చు. రెండవది (2003లో ఇరాక్ సమయంలో మాదిరి) సరఫరా 30 నుంచి 50లక్షల పీపాల వరకు తగ్గవచ్చు, ధరలు 21 నుంచి 35శాతం పెరుగుదల, మూడవది 1973 చమురు సంక్షోభం మాదిరి ఎనభై లక్షల పీపాల మేరకు సరఫరా తగ్గుదల, 56 నుంచి 75శాతం మేరకు ధరలు పెరగవచ్చు.
ఈ నెల ఏడవతేదీ నాటికి గాజాలో ప్రారంభమైన ఇజ్రాయిల్ మారణ కాండకు ఏడాది నిండుతుంది.ఇప్పటి వరకు 41,586 మంది మరణించగా 96,210 మంది గాయపడ్డారు, పది వేల మంది జాడ కనిపించటం లేదు.లక్షలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ఐరాస నిర్వహించే సహాయశిబిరాలు దేన్నీ దాడులలో వదలటం లేదు. అయినప్పటికీ హమాస్ సాయుధులను అంతం చేస్తామన్న ఇజ్రాయిల్ పంతం నెరవేరే సూచనలు కనిపించటం లేదు. ఇదే సమయంలో పాలస్తీనా దురాక్రమణ, గాజా మారణకాండను వ్యతిరేకిస్తున్న హిజబుల్లాను అణచేపేరుతో లెబనాన్ మీద వైమానికదాడులకు దిగింది. దాని అధిపతి, ఇతర ముఖ్యనేతలను హతమార్చవచ్చు తప్ప పూర్తిగా అణచివేయటం ఇజ్రాయిల్ తరం కాదని అందరూ చెబుతున్నారు. ఎందుకంటే హమాస్‌తో పోల్చితే దాని పోరాట యోధులు, ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే. ఇజ్రాయిల్ మిలిటరీతో పోల్చితే దాని ఆయుధాలు, సాయుధుల సంఖ్య చాలా తక్కువ అని కూడా గమనించాలి.హిజబుల్లా దగ్గర 30 నుంచి 50వేల మంది వరకు ఉన్నారని అంచనా. అయితే తమ యోధుల సంఖ్య లక్షకు పైబడే అని ఇటీవల హత్యకు గురైన నస్రల్లా గతంలో ప్రకటించాడు. ఐదు నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే క్షిపణులు లక్షా ఇరవైవేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లు అంచనా, ఇవి గాక ఇరాన్ సరఫరా చేసిన మానవరహిత విమానాలు కొన్ని, ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు క్షిపణులను ప్రయోగించే సంచార వాహన వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్‌లోని ఏ ప్రాంతం మీదనైనా దాడికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇజ్రాయిల్ వద్ద త్రివిధ దళాల రెగ్యులర్ మిలిటరీ, రిజర్వు దళాల మొత్తం 1,69,500 నుంచి 6,34,500 మంది ఉన్నారు. తమ మీదకు వదిలే క్షిపణులను ముందుగా లేదా మధ్యలో గుర్తించి కూల్చివేసే ఆధునిక రక్షణ వ్యవ స్థలు, భారీ క్షిపణులు, వందలాది విమానాలు, నౌకలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగ నుందో అనే భయంతో వణికిపోయే జనం, వారి రక్షణకు ప్రతి నగరంలో భూగర్భ గృహాలు కూడా ఉన్నాయి.
ఇజ్రాయిల్‌కు ఇంతబలం ఉన్నప్పటికీ తన రక్షణ కోసం అవసరం అంటూ గతంలో దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇరాన్‌లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చిన తరువాత 1979లో షియా ముస్లిం తెగకు చెందిన కొద్ది మందితో హిజబుల్లా (దేవుడి పార్టీ)ను ఏర్పాటు చేశారు. అయితే 1982లో ఇజ్రాయిల్ దురాక్రమణకు పాల్పడిన తరువాతే అది ప్రాచర్యంలోకి వచ్చింది. 1985లో లెబనాన్ అంతర్యుద్ధం సందర్భంగా అక్కడి వివిధ షియా సంస్థలన్నీ హిజబుల్లా నాయకత్వంలో ఐక్యమయ్యాయి. తరువాత ఇజ్రాయిల్ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ పోరును ప్రారం భించింది.2006లో ఇజ్రాయిల్ వైదొలగే వరకు అది పోరుబాటలో ఉంది. ఈ క్రమంలోనే అది రాజకీయ సంస్థగా కూడా రూపుదిద్దుకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తన సాయుధ విభాగాన్ని కొనసాగిస్తున్నది. దీనికి లెబనాన్ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది.ప్రస్తుతం సంకీర్ణ మంత్రివర్గంలో ఇద్దరు సభ్యులు, 128 మందితో ఉన్న పార్లమెంటులో 15 స్థానాలతో హిజబుల్లా పెద్ద పక్షంగా ఉంది.
పలుచోట్ల తనను వ్యతిరేకించే సంస్థల నేతలను దొంగ దెబ్బలతో హత్య కావించటం, పేజర్లు, వాకీటాకీలను పేల్చి లెబనాన్‌లో హిజబుల్లాపై దాడుల ద్వారా తనకు ఎదురులేదని ఆప్రాంతంలోని వ్యతిరేకులను బెదిరించటమే ఇజ్రాయిల్ ్‌దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్యవాదశక్తుల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొస్తాడన్నట్లు చరిత్ర రుజువు చేసింది. నస్రల్లా ఉన్న బంకర్‌ను బద్దలు చేసేందుకు అమెరికా సరఫరా చేసిన ఎఫ్-15 విమానాలతో వెయ్యి కిలోల బరువుండే 85బాంబులను ప్రయోగించి హత్యచేశారు. నాలుగు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. నస్రల్లా హత్యతో అనేక మంది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని జో బైడెన్ అన్నాడు. ఈ చర్యలన్నీ ఇరాన్‌ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించే అమెరికా కుట్రలో భాగం తప్ప మరొకటి కాదన్నది పదే పదే చెప్పనవసరం లేదు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఒక మ్యాప్‌ను చూపుతూ దానిలో ఉన్న లెబనాన్, ఇరాన్, సిరియా, ఇరాక్ ఒక చీడ అంటూ దాన్ని దాన్ని తొలగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అమెరికా మద్దతుతో అనేక మంది అనుకుంటున్నదాని కంటే ముందే ఈ కలను సాకారం చేస్తామని కూడా వివరించారు. పాలస్తీనా ఉనికే లేని నూతన మధ్య ప్రాచ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నస్రల్లాను చంపిన బాంబుదాడి జరిపిన విమానపైలట్ మాట్లాడుతూ తాము ప్రతివారినీ, ప్రతి చోటా దెబ్బతీస్తామన్నారు. ఎలాగైనా సరే ప్రపంచాన్ని గెలుచుకుంటా మంటూ అమెరికా చెబుతున్నది కూడా అదే.
తాజా దాడుల విషయానికి వస్తే హిజబుల్లాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నట్లు ఇజ్రాయిల్, పశ్చిమదేశాల మీడియా చిత్రిస్తున్నప్పటికీ వాటి తీరుతెన్నులను చూస్తే సామాన్య జనం మీదనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారు. వేలాది గృహాలను నేలమట్టం చేశారు. గాజా, బీరూట్, లెబనాన్ కేంద్రాలుగా పనిచేస్తున్న సాయుధ సంస్థలు తమ ఆయుధాలను సొరంగాల్లో దాస్తున్నాయి తప్ప పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నట్లు సాధారణ పౌరుల ఇండ్లలో కాదు. అయితే ప్రతిఘటన పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న కారణంగా పరిస్థితి అడవుల్లో మాదిరి ఉండదని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఇజ్రాయిల్ దాడులు చేసినపుడు పౌరులు ఇండ్లను ఖాళీచేయాలని పదే పదే చెబుతోంది. గాజాలో మాదిరే బీరూట్, పరిసరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా విమోచన సంస్థ(పిఎల్‌ఓ) లెబనాన్ నుంచి తమ మీద దాడులు జరుపుతోందని, అందువలన రక్షణగా కొన్ని ప్రాంతాలు తమకు అవసరమంటూ 1982 ఇజ్రాయెల్ ఆక్రమణలకు పూనుకుంది. నిజానికి సిరియా-లెబనాన్ మధ్య వివాదం ఉన్న గోలన్ గుట్టలను 1967 తరువాత 1973, 1981లో కూడా కొత్త ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించింది. ఇప్పటికీ ఆ ప్రాంతం దాని ఆక్రమణలోనే ఉంది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఆక్రమిత ప్రాంతాల పౌరులకు ప్రతిఘటించే హక్కును గుర్తించారు. ఆ విధంగా ఇజ్రాయిల్ ఆక్రమణలోని లెబనాన్ ప్రాంతాల విముక్తికి తాము పోరాడుతున్నట్లు హిజబుల్లా చెబుతోంది. నస్రల్లా మరణం తరువాత ఉపనేత నయిమ్ ఖాసిం దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ నస్రల్లా మరణ సమయంలో 20 మంది నేతలతో సమావేశం జరుగుతున్నదని వారంతా మరణించారని ఇజ్రాయిల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ మిలిటరీ కమాండర్, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల డిప్యూటీ కమాండర్, భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పారు. 2006లో మాదిరే ఇజ్రాయిల్‌ను వెనక్కు కొడతామని విజయం మనదే అని ప్రకటించారు.
ఎం కోటేశ్వరరావు
8331013288