మారుతున్న కాలంతోపాటు జీవనశైలి, ఉద్యోగ వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ రీత్యా కొంతమంది నైట్‌షిఫ్టుల్లో పనిచేయక తప్పదు. వాస్తవానికి వీళ్ల దినచర్య సాధారణ షిఫ్టులున్న వాళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే, నైట్ షిఫ్టులతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా మహిళలకు. ఈ క్రమంలో వాటి ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
నిద్రకు దూరం
మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి నిద్ర చాలా అవసరం. రోజంతా పనిచేసి అలసిన శరీరానికి నిద్రతో విశ్రాంతి దొరుకుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల ఒత్తిళ్లు దూరమై మన శరీరం తిరిగి పునరుత్తేజితమవుతుందని చెబుతున్నారు. కానీ, నైట్‌షిఫ్ట్‌లో పని చేసేవారు క్రమంగా సహజమైన నిద్రకు దూరమవుతుంటారు. దీనివల్ల వారిలో నిద్రలేమి సమస్య మొదలై, క్రమంగా అది పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
రొమ్ము క్యాన్సర్
పగలు పనిచేసే మహిళలతో పోలిస్తే రాత్రిపూట పనిచేసే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది క్రమంగా రాత్రి వేళల్లో పనిచేసే వారితో పాటు వారానికోసారి నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వాళ్లకూ కచ్చితంగా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డిప్రెషన్
మిగతా వాళ్లతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పని చేసేవారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, సామాజిక జీవితానికి దూరంగా ఉండడం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపలేకపోవడం మొదలైన కారణాల వల్ల వాళ్లు ప్రశాంతంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. దీనివల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ కారణంతో వారిలో ఒంటరితనం, మానసిక అలసట, డిప్రెషన్ లాంటివి పెరుగుతాయని తెలియజేస్తున్నారు.
గుండె జబ్బులు
నిద్ర కేవలం విశ్రాంతి కోసమే కాదు. ఆ నిద్రలోనే రక్తనాళాలు స్వయంగా రిపేర్ చేసుకుంటాయట. ఈ క్రమంలో రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, అధిక పని గంటలు, నైట్‌షిఫ్ట్‌ల కారణంగానే గుండెపోటుతో మరణించిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
విటమిన్ డి కి దూరం
సూర్మరశ్మి ద్వారా మన శరీరానికి విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో మిగతా వారితో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వాళ్లపై సూర్యరశ్మి పడడం తక్కువగా ఉంటుంది. ఫలితంగా వాళ్ల శరీరంలో క్యాల్షియం శాతం తగ్గడంతో పాటు వివిధ రకాల క్యాన్సర్లకూ దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు
నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసేవారు వివిధ రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. దీంతో శరీరంలో ఇన్సులిన్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల డయాబెటిస్, ఒబెసిటీ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు.
ఇలా నైట్‌షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల ఇంకెన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా ఏ మాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇవి పాటించండి
– ఉద్యోగరీత్యా నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు తమ ఆరోగ్య విషయం, జీవనశైలి పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
– నైట్‌షిఫ్ట్ ముగిసిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోమంటున్నారు నిపుణులు.
– షిఫ్ట్ టైం బట్టి మీ భోజన సమయాలను సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఆ వేళల్లోనే భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీరం నెమ్మదిగా ఈ పద్ధతికి అలవాటు పడుతుంది.
– మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు తీసుకుంటే మేలు.
– భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది కాదు. ఆకలిగా అనిపించకపోతే కనీసం ఒక గ్లాసు పాలు తాగి పడుకోవడం మంచిది. దీనివల్ల సులభంగా నిద్ర పడుతుంది.
– నైట్‌షిఫ్ట్‌ల్లో కాఫీ లేదా టీ, కూల్‌డ్రింక్స్ లాంటివి తాగడం తగ్గించాలి. వాటికి బదులు కాఫీ బ్రేక్స్‌లో తాజా పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోవాలి.
– క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం మొదలైనవి చేయడం ద్వారా అటు శారీరకంగా, ఇటు మానసికంగా శక్తిని పొందుతారు.
– వీకెండ్స్‌లో మీ సమయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేటాయించాలి. దీని ద్వారా మానసిక ఒత్తిడి నుంచి మీకు కాస్త విశ్రాంతి లభిస్తుంది.


