అహంకారం, అసంతృప్తే కారణమా?

Arrogance and unhappiness?– పనిచేయని సంక్షేమం, అభివృద్ధి మంత్రం
– భారీ ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ ఓటమి
– పరువు కాపాడిన మాజీ మంత్రి జగదీశ్‌
– సమస్యలపై పోరాటం చేసేనా..?
నవతెలంగాణ -మిర్యాలగూడ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘గులాబీ’ పార్టీ చతికిల పడింది. 12 స్థానాల్లో 11 స్థానాలు కోల్పోయి ఉనికి లేకుండా చేసుకుంది. ఒకే ఒక్క స్థానం గెలుపొంది మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. భారీ ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకతతోపాటు కిందిస్థాయి క్యాడర్లలో అసంతృప్తి ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ప్రధాన కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఇంటికి లబ్ది చేకూర్చినా ఫలితం దక్కకపోవడానికి అభ్యర్థులతోపాటు పై నాయకత్వం కూడా ఒక కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో భారీ నష్టం మూట కట్టుకోవాల్సి వచ్చింది.
అహంకారమే కారణం..?
బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలకంగా మారింది. నల్లగొండ, కోదాడ, హుజర్‌నగర్‌లో 2018లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు నోముల భగత్‌ గెలుపొందారు. మునుగోడులో సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో 2022లో ఉప ఎన్నిక వచ్చింది. నకిరేకల్‌లో కాంగ్రెస్‌ తరపున గెలుపొందిన చిరుమర్రి లింగయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ మూడు నియోజకవర్గాలు పోను మిగిలిన ఐదు నియోజకవర్గాలైన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో ఆ పార్టీ వారే 10 సంవత్సరాలుగా కొనసాగారు. వారి అహంకారం, కార్యకర్తలు, ప్రజల్లో వారి పట్ల అసంతృప్తి పెరగడమే ప్రస్తుత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం, దౌర్జన్యాలు, భూకబ్జాలు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమని అంటున్నారు.
చక్రం తిప్పిన ఆ ముగ్గురే ..!
కాంగ్రెస్‌ సీనియర్లుగా పేరొందిన ఆ ముగ్గురు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావడంతో ఈ ఎన్నికల్లో చక్రం తిప్పి సఫలమయ్యారు. గతంలో పీసీసీగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో తన పట్టు పెంచుకుని విజయానికి నాంది పలికారు. తాను గెలవడంతోపాటు ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి గెలిపించుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి గెలవడంతోపాటు నకిరేకల్‌, తుంగతుర్తి నుంచి వేముల వీరేశం, మందుల శామ్యూల్‌కు టికెట్లు ఇప్పించి వారి గెలుపుకు కృషి చేశారు.
సీనియర్‌ నాయకుడైన జానారెడ్డి తన కొడుకు జై వీర్‌ రెడ్డిని నాగార్జునసాగర్‌ నుంచి గెలిపించుకోవడంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చి వారికి గెలుపు కోసం పనిచేశారు. సీపీఐ(ఎం)తో పొత్తుకు జాప్యం కారణంగా చివరి నిమిషంలో మిర్యాలగూడ టికెట్‌ సామాజిక వేత్త బీఎల్‌ఆర్‌ రావడంతో జానారెడ్డి సహకరించారు.
దేవరకొండలో తన అనుచరుడైన బాలునాయక్‌ గెలుపుకు చేయూతనిచ్చారు. ఈ ముగ్గురు సీనియర్‌ నాయకులు ఐక్యతతో ఉండి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించడంతో అత్యధిక స్థానాలు గెలిచేందుకు అవకాశం కలిగింది. అదే సమయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చింది.
కలిసిరాని అభివృద్ధి, సంక్షేమం
అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలేవీ ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్టు, ఆసరా పెన్షన్లు, ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు, దళిత బంధు, పోడు భూములకు పట్టాల పంపిణీ, ఆయా సామాజిక తరగతులకు రుణాలు వంటివి అందించినా జనం మమ్మల్ని ఆదరించకపోవడానికి మరేదైనా ఉండొచ్చని బీఆర్‌ఎస్‌లో చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓటుకు నోటు ఇచ్చినా జనం నమ్మలేదు. అత్యధికంగా కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇవ్వడం కూడా పరాజయానికి కారణంంగా ఆ పార్టీ నేతల అభిప్రాయం.

Spread the love