ఇదీ జుమ్లాయేనా?

ఎట్టకేలకు 11 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెలువడిన హౌస్‌ హోల్డ్‌ ఎక్స్‌పెండేచర్‌ సర్వే రిపోర్టు ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతానికి తగ్గిందని నిటిఅయోగ్‌ చెబుతున్నది. కానీ ఇదే నిటిఅయోగ్‌ ‘మల్టీ డైమె న్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌’ రిపోర్టులో దేశంలో పేదరికం 11.28 శాతం ఉన్నదని పేర్కొంది. ఇవి రెండు సర్వేలు కూడా 2022-23కు సంబం ధించి చేసినవే. నిటిఅయోగ్‌ నివేదికకు ప్రాతిపదికలు ఏమిటో తెలియదు. దేశంలో పేదరికం ఐదు శాతానికి తగ్గిందంటూ అంటే, దేశంలో కేవలం 7కోట్ల మందే పేదలు ఉన్నారని చెప్తూ 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌ ఎందుకిస్తున్నట్టు? నరేంద్రమోడీ ఏలుబడిలో పదేండ్లలో ఏకంగా పాతికకోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారంటున్న నిటిఅయోగ్‌ లెక్కలు వెలువడ టానికి కొద్దిరోజుల ముందు దావోస్‌ సదస్సు సందర్భంలో ఆక్స్‌ఫామ్‌ అసమానతలమీద తన నివేదిక వెలువరించింది. శతకోటీశ్వరులు సహ స్రకోటీశ్వరులవుతున్న ఈ ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని తరిమి కొట్టడానికి మరో రెండువందలేండ్లు పడుతుందంటూ విమర్శించింది.
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నెలవారీ తలసరి వ్యయం 2011-12, 2022-23 మధ్య వార్షిక వృద్ధి రేటు ఇది దాదాపు నాలుగు శాతం మాత్రమే. ఇదే కాలంలో పట్టణ ప్రాంతాలలో కేవలం మూడు శాతం పెరుగుదల రేటు మాత్రమే నమోదయింది. దీనిలో ధనికుల, పేదల మధ్య దిగ్భ్రాంతికరమైన అసమానతల చిత్రం దాగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం మంది పేదలు ప్రతి నెలా ఒక్కొక్కరికి కేవలం రూ.1373 ఖర్చు చేస్తుంటే, ధనవంతులైన ఐదు శాతం మంది ఒక్కో వ్యక్తికి రూ.10,501 ఖర్చు చేస్తు న్నారు. అంటే ధనిక వర్గాలకు చెందిన వారు పేదల కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇది వారు విడుదల చేసి డేటా ప్రకారమే.
తాజాగా వెలువడే ఇలాంటి నివేదికలు ఒక ఎన్నికల జుమ్లాలేమో! లోక్‌సభ ఎన్నికలముందు, అవి ముగిసేవరకూ ఇటువంటి తప్పుడు తడక లెక్కలే ప్రజలముందుకు రావచ్చు. వేతనాలు తగ్గిపోతూ, ఆర్థిక అసమాన తలు పెరిగిపోతున్న కాలంలో, పేదరికం పెద్దఎత్తున నాశనమైందని, నిరుద్యోగం సమసిపోయిందని కేంద్రప్రభుత్వ సంస్థలు ఎలా చెబుతాయి? నిటిఅయోగ్‌ నివేదిక సరైనదే అయితే, దేశంలో వినియోగం ఎందుకు తగ్గింది, ప్రభుత్వం తన రేషన్‌ పథకాలను మరిం త విస్తరిస్తూ 80కోట్లమందికి ఉచిత రేషన్‌ ఎందుకు ఇస్తున్నదనేదే అసలు ప్రశ్న. తమ పాలనలో పేదలు పాతికకోట్లు తగ్గారని చెప్పుకోవడం ఎన్నికల ముందు బీజేపీకి అవసరం కాబట్టే ఈ జిమ్మిక్కులు.
పేదరికం, దారిద్య్ర నిర్మూలన పథకాల రూప కల్పన నిమిత్తం ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా వాస్తవాల అధ్యయనానికై కమిటీలు వేస్తుం టాయి. మన దేశంలో కూడా వివిధ కాలాల్లో నియమించిన లక్డావాలా, సురేశ్‌ టెండూల్కర్‌, సి.రంగ రాజన్‌ కమిటీలు అటువంటివే. అవి ఆహార, వినిమయం, వ్యయం ప్రాతిపదికంగా దారిద్య్ర రేఖ నిర్ణయిస్తుంటాయి. ప్రపంచబ్యాంక్‌ అంత ర్జాతీయ దారిద్య్రరేఖ నిర్ణయిస్తుంటుంది. కనీస ఆహారం, దుస్తులు, ఆవాసం నీటిపై వ్యయమే ప్రాతిపదిక. వైద్యం, విద్య రవాణా వగైరాలను ఇది పరిగణనలోకి తీసుకోదు.
ఎన్‌ఎస్‌ఎస్‌ఒ ఏమి చెబుతున్న దంటే, 2011-12లో ఆమోదిం చిన దాని ప్రకారం ఒక వ్యక్తి కి ఒక రోజుకు అయ్యే ఖర్చు రూ.32 అయితే ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే అది రోజుకు రూ.60లకు చేరుతుంది. ఎందుకంటే, గ్రామీణ భారత్‌లోని దిగువ ఐదు శాతం నుండి 10 శాతం జనాభా సగటు వ్యయం రూ.1782 ఉంటుంది. నిటిఆయోగ్‌ ప్రకారం.. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన లేదా సబ్సిడీకి గ్యాస్‌ సిలిండర్‌లు వంటి వాటి ద్వారా అందుకున్న ఆహార బదిలీలు, సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే, దారిద్య్ర బాధితులు ఐదు శాతం లోపే ఉంటారు. అంతేగాక ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్య వంటి అంశాలను కూడా కలిపి చూడాలి అంటారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వారి తాజా కుటుంబ వినిమయ వ్యయం సర్వే (హెచ్‌సిఇఎస్‌) ప్రకారం, ఆహారం, పానీయాల మీద పేదలు పెడుతున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 52.9 శాతం నుంచి 46.4 శాతానికి తగ్గింది. అదే విధంగా పట్టణప్రాంతాల్లో అది 39.2 శాతానికి తగ్గింది. అయితే నిత్య జీవితావసర వస్తువుల ధరల పెరుగుదలను, ఆహారోత్పత్తుల ధరల్లో ఆకస్మిక ఎగుడు దిగుళ్లకు, పెరిగి కూర్చున్న విద్యుత్‌, ఆయిల్‌, వంటగ్యాస్‌ రేట్లు, విద్య, వైద్యం, రవాణా, ఇంటి అద్దెలు పెరుగుదల వగైరాలను పరిగణనలోకి తీసుకుని జీవన వ్యయాన్ని లెక్కిస్తే దారిద్య్రరేఖను పెంపు చేయాల్సి ఉంటుంది. కాలంతో పాటు మనుషుల అవసరాలు వారు అట్టడుగు వారికైనా, మధ్య తరగతులవారికైనా పెరుగుతూ ఉంటాయి. కేవలం కూడు, గూడు, బట్ట మాత్రమే మనిషిని ఈ 21వ శతాబ్దంలో సంతృప్తి పరచవు. దారిద్య్రం తగ్గుదల ప్రభావం కాగితాలపై లెక్కల్లోగాక ఆ శ్రేణి ప్రజల జీవనంలో ప్రతిఫలించాలి.

Spread the love