నవతెలంగాణ-హైదరాబాద్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన ప్రకటన చేశారు. గాజా స్ట్రిప్‌లోని 70 శాతం భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గాజాలోని అధిక భూభాగం సైనిక నియంత్రణలోకి తీసుకునే ప్లాన్‌ను నెతన్యాహూ ప్రకటించారు. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దళాలు తమ పట్టును క్రమంగా పెంచుకుంటున్నాయని, హమాస్‌కు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంటాయని అన్నారు.
2025 అక్టోబర్‌లో ఇజ్రాయిల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయిల్ సైన్యం ‘‘ఎల్లో లైన్’’ అనే సరిహద్దు వరకు వెనక్కి వెళ్లింది. ఈ ప్రాంతం గాజాలో సుమారు 53 శాతం వరకు ఉండేది. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్ ఈ సరిహద్దును మరింత లోపలికి నెట్టిందని హమాస్ ఆరోపిస్తోంది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని విమర్శిస్తోంది.



