సీఏఏ చట్టం కింద తొలి విడత పౌరసత్వ సర్టిఫికేట్ల జారీ

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో పెను కలకలం రేపిన సీఏఏ చట్టం కింద తొలిసారిగా కేంద్రం 14 మంది శరణార్థులకు పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసింది. ఆన్‌లైన్‌‌లో వీరి దరఖాస్తులు ప్రాసెస్ చేసిన అనంతరం బుధవారం ఈ సర్టిఫికేట్లు జారీ చేశారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా పౌరసత్వ పత్రాలను అందజేశారు. పాక్ నుంచి వచ్చిన భావన తనకు భారత పౌరసత్వం దక్కడంపై హర్షం వ్యక్తం చేసింది. ‘‘నాకు ఈ రోజు భారత పౌరసత్వం లభించింది. చాలా ఆనందంగా ఉన్నా. ఇక నేను చదువు కొనసాగించవచ్చు. 2014లో నేను ఇక్కడకు వచ్చా. అప్పట్లో సీఏఏ చట్టం పాసవడం చూసి ఎంతో సంతోషించా. పాకిస్థాన్‌లో అమ్మాయిలకు చదువుకునే అవకాశాలు తక్కువ. బయటకి వెళ్లాలంటేనే కష్టంగా ఉండేది. బయటకు వెళ్లినప్పుడల్లా బుర్కా వేసుకుని వెళ్లేవాళ్లం. కానీ భారత్‌లో పరిస్థితి పూర్తి భిన్నం. ప్రస్తుతం నేను 11వ తరగతి చదువుతున్నా. ట్యూషన్‌కు కూడా వెళుతున్నా’’ అని భావన సంబర పడిపోతూ చెప్పింది. తొలి విడత పౌరసత్వ చట్టాల జారీపై హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సీఏఏ చట్టం కింద పౌరసత్వ సర్టిఫికేట్ల జారీ కార్యక్రమాన్ని హోం శాఖ నేడు ప్రారంభించింది. పౌరసత్వం పొందిన 14 మంది శరణార్థులకు నా అభినందనలు.
సీఏఏ అంటే ప్రధాని మోదీ దేశానికి ఇచ్చిన హామీ’’ అని అమిత్ షా అన్నారు. శరణార్థులకు త్వరిత గతిన భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణ చేస్తూ సీఏఏను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం, 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ నుంచి మతపరమైన హింస కారణంగా భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, జైన, పార్శీ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ మతస్థులకు త్వరిత గతిన పౌరసత్వం ఇస్తారు. అయితే, మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తున్న ఈ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందంటూ అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.

Spread the love