భవిష్యత్ కార్యాచరణపై మే 13న చర్చలు
కార్మికులపై అణచివేత చర్యలను ఖండించిన కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం
న్యూఢిల్లీ : ఏండ్ల తరబడి పెండింగ్‌లో వున్న వేతనాల పెంపు కోసం అలాగే 8గంటల పనిదినం, చట్టబద్ధమైన ఓవర్‌టైమ్ అలవెన్స్, వీక్లీ ఆఫ్, పని ప్రదేశాల్లోని ఇతర సమస్యలపై పోరాడుతున్న కార్మికులపై అణచివేత చర్యలను కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సంయుక్త వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ నెల 24న జరిగిన సంయుక్త సమావేశం ఇటీవల జరిగిన పరిణామాలను సమీక్షించింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగినా గత పదేండ్లుగా అనేక రాష్ట్రాల్లో కనీస వేతనాలు సవరణకు నోచుకోలేదని గుర్తించింది. అనేక పారిశ్రామిక కేంద్రాల్లో కాంట్రాక్ట్, క్యాజువల్ లేదా నిర్దిష్ట కాలపరిమితి గల కార్మికులు ఎలాంటి మౌలిక వసతులు లేనిచోట్ల, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వలస కార్మికులుగా వున్నారని పేర్కొంది. పైగా వీరిని కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించరని, ఒకవేళ అందుకు ప్రయత్నిస్తే వారు బాధితులుగా మారాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం వరుసగా చేస్తున్న పోరాటాలు, ఆందోళనలు ఏదో చెదురు మదురుగా జరుగుతున్నవి కాదని కూడా సమావేశం గుర్తించింది.
కేవలం రెండు నెలల క్రితం, బీహార్‌లోని బరౌని రిఫైనరీ ఏరియాల్లో వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులు వీధుల్లోకి వచ్చారు. వారిలో చాలామంది కాంట్రాక్టు కార్మికులే, తమ గళం వినిపిస్తే ఉద్యోగాలు పోతాయనే భయంతో జీవిస్తున్న వారే. అయినా వారు న్యాయం కోరుతూ వీధుల్లోకి వచ్చారు. 8గంటల పనిదినాన్ని అమలు చేయాలని, చేసిన అదనపు పనిగంటలకు ఓవర్‌టైమ్ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇవి అక్కడి కార్మికుల డిమాండ్లు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వేలాది పని ప్రదేశాల్లో పనిచేసే వారి సమంజసమైన డిమాండ్లే. సామాజిక భద్రత కావాలని, ఉపాధి కార్డులివ్వాలని, వేతన స్లిప్‌లు ఇవ్వాలని, రెగ్యులర్ కార్మికులతో సమానంగా శలవులు ఇవ్వాలని, పనిప్రదేశాల్లో భద్రత, గౌరవం వుండాలని కోరుతున్నారు. పానిపట్‌లో, మనేసర్‌లో కూడా ఇదే పరిస్థితి. గత మూడు మాసాల్లో కార్మికుల దుస్థితి, వారి నిస్సహాయత, ఆగ్రహావేశాలు ఈ దేశం చూస్తోందని, దీనివల్ల పారిశ్రమిక కేంద్రాల్లో అశాంతి నెలకొందని సమావేశం పేర్కొంది. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. తక్షణమే దేశ అత్యున్నత స్థాయి త్రైపాక్షిక సంస్థ అయిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌సీ) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. చివరిగా సారిగా ఈ సంస్థ 2015లో సమావేశమైంది.
కార్మికుల ఆకస్మిక ఆందోళనల్లో, తిరుగుబాటుల్లో జాతి వ్యతిరేక శక్తుల ్పరమేయం వుందని, పాకిస్తాన్ పాత్ర వుందని వస్తున్న తప్పుడు కథనాలను కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్కేఎం తీవ్రంగా ఖండించాయి.
ఈ నేపథ్యంలో కార్మికుల కీలక డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణను నిర్ణయించేందుకు గానూ సవివరమైన చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు మే 13వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగాల సమాఖ్యలు, అసోసియేన్ల వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం కానున్నాయి.
పదేండ్లైనా కనీసవేతనాలకు దిక్కులేదు
- Advertisement -
- Advertisement -



