బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని , ఉన్నది ఒకటే కేసీఆర్ గ్రూప్ మాత్రమే అని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. పత్రికా సమావేశంలో ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపులు ఉన్నాయంటూ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆలేరు నియోజకవర్గంలో గులాబీ శ్రేణులంతా కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గదర్శకత్వంలో ఒకే కుటుంబంలా పనిచేస్తున్నారని, ఇక్కడ ఎవరికీ సొంత గ్రూపులు లేవు, ఉండవు. ఒకే తాటిపై బీఆర్ఎస్ శ్రేణులు నడుస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రతిపక్ష పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలేరులో ప్రగతి కుంటుపడింది. రైతులకు ఇచ్చిన హామీలు, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడటం మానేసి, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని హితవు పలికారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో, ఆలేరు నియోజకవర్గంలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నిక కావడం ఖాయం అని జోస్యం చెప్పారు.



