రచన.. గురుముఖంగా వచ్చే కళ కాదు. ‘మీకు రచనలు చేయాలని ఉందా?’ అంటూ.. రచయితగా నిలబడాలన్న ఏ వ్యక్తి అయినా ‘ఓహో! ఇదేదో బాగుందే’ అని వెంటనే ఏరుకుని అటు ఇటు తిప్పి చూడాలనిపించేలా ఆకర్షించే పుస్తకం ఇది. రచనల వైపు చూపు సారించినప్పుడు తాను చూసిన, విన్న సంఘటనలు మనసులోని ఆలోచనలు పొంగి రచనా వెల్లువకు ఆధారాలవుతాయి. శ్రీశ్రీ గారు రచయితగా భాషపై పట్టు రావడానికి రామాయణ, మహాభారతం చదవాలని సలహా ఇచ్చేవారట. అయితే ఈ పుస్తక రచయిత స్వయంగా ఇక్కడ మంచి ప్రశ్నలేవనెత్తారు. అది ‘రచనలు చేయడం అనేది పూర్వజన్మ సుకతమని, అది దైవదత్తమని, పుట్టుక నుంచే అది అలవడాలని అంటుంటారు. మరి ఇప్పుడు ప్రసిద్ధ రచయితలంతా ఒకప్పుడు పుణ్యం చేసుకోవడం వల్లనే ఈనాడు రచయితలుగా పేరు తెచ్చుకున్నారంటారా? అదే నిజమైతే ఈ పుస్తకం రాయాల్సిన అవసరం లేదు అనుకుంటా నేను…’ అంటారు. ఈ పుస్తకం అంతా రచనలు చేయడానికి అవసరమైన ప్రశ్నలతో నిండి ఉంది. ఆ ప్రశ్నలు వేసుకున్న వారు మంచి రచయితలుగా ఎదుగుతారని స్పష్టం. భవిష్యత్ తరాల మార్పును కోరే రచనలైతే మేధావులను, పాఠకులను మెప్పిస్తాయి.
గురజాడ, కందుకూరి వంటివారు ఆనాటి సమాజంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన దురాచారాల నిర్మూలన కోసం సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. సమాజం ఎటు పోతే నాకేంటి అనుకునేవారు కేవలం పేరు, డబ్బు రావాలని మాత్రమే భావిస్తారు. సాహిత్యం చదివే వారే కరువైన ఈ రోజుల్లో మార్పు కూడా కష్టమే. ఎవరైనా ఫలానా కథ చదివి మారానని అంటే అది గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఇంకొందరు కేవలం హాబీగా కాలక్షేపం కోసం మాత్రమే రాస్తుంటారు. రచన అంటే గుండెల్లో నుంచి తన్నుకొచ్చి, భావావేశంతో అక్షర విన్యాసం చేసి రచనగా రూపొందించుకోవాలి. రచన గురుముఖంగా సాధన చేసి నేర్చుకునే కళ కాదు అంటాడు రచయిత. సాహిత్యంలో ప్రక్రియల గురించి పద్యం, కవిత, గజల్, కథ, నవల, గల్పిక, నాటిక, రూపకం, నానీలు, హైకూలు, పేరడి, జానపదాలు, బుర్రకథ, నాటకం, యాత్రా రచన… ఇలా ఏ ప్రక్రియకైనా రచయిత కావాలనుకున్న వారికి చదువే ప్రధానం. ఏ ప్రక్రియ ఆకట్టుకుంటే ఆ ప్రక్రియపై రచనాసక్తి కలుగుతుంది. కొందరు అన్ని ప్రక్రియలలో నిష్ణాతులవుతారు. దీనికి నిరంతర సాధన కావాలి. రచనలు చేయడానికి అవసరమైనవి ఎంచుకున్న అంశం, రచన రూపుదిద్దడం, ఎత్తుగడ, పాత్రల ప్రాధాన్యాత, ముగింపు, కొసమెరుపు, రచనలు ఏ పత్రికకు, ఎలా పంపాలో అనే మెళకువలు కూడా ఇందులో పొందు పరచడం విశేషం. ఇలా ప్రతి అంశానికి ఉదాహరణలు ఇచ్చి వాటి మెళకువలను చాలా వివరంగా చెప్పిన ఈ పుస్తకం రచయితలకు కరదీపిక లాంటిది.
-మహేష్ దుర్గే
9700888972


