వచ్చే ఎన్నికల్లోనే అమలు చేయాలి

It should be implemented in the next election itself– మహిళా రిజర్వేషన్స్‌పై చిత్తశుద్ధి నిరూపించుకోండి..
– అక్టోబర్‌ 5న చలో ఢిల్లీని విజయవంతం చేయండి : జీపు జాతాలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë
నవతెలంగాణ-మిర్యాలగూడ
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం కోసం చేపట్టిన జీపు జాతా బుధవారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలానికి చేరుకుంది. జాతా బృందానికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించిన సభలో మల్లు లకిë మాట్లాడారు. 27 ఏండ్ల పోరాట ఫలితంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్స్‌ను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసి మోడీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా బిల్లు అమలవుతుందని చెప్పడం సరైనది కాదన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లను మభ్య పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, లైంగికదాడులు పెరిగి పోయాయని తెలిపారు. కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పుట్టిన పసిపాప నుంచి ముసలి వరకు ఈ దేశంలో మహిళలకు రక్షణ కరువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం మహిళలు గలమెత్తి ఉద్యమించాలన్నారు. మహిళలకు పని భారం పెరగడం వల్ల.. పౌష్టికాహారం లేక అనారోగ్యానికి గురవుతున్నారని, 57 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. 67 శాతం మంది ఐదు సంవత్సరాల్లోపు పిల్లల్లో 67 శాతం పౌష్టికాహారం లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలకు ఆర్థిక, మానసిక పరిపుష్టి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచాలని, రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలకు గూడు కోసం 125 గజాల ఇంటి స్థలం ఇచ్చి కేంద్రం రూ.10 లక్షలు, రాష్ట్ర రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. 14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్‌ షాపులో అందించాలని, డ్వాక్రా మహిళలకు అభయ హస్తం అమలు చేయాలని కోరారు. అనంతరం జాతా బృందాన్ని సన్మానించారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు పోలెబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సీనియర్‌ నాయకులు పద్మ, జిల్లా కార్యదర్శి పాదూరి గోవర్ధన, నాయకులు సైదమ్మ, పూలమ్మ, ఊర్మిళ, అరుణ, పార్వతి, నిర్మల, రాధాబాయి, నాగమణి స్వరాజ్యం, రాణి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు పాషా తదితరులు పాల్గొన్నారు.

Spread the love