జగతికి వెలుగు నిచ్చే సూర్యుడి శక్తి ద్వారా తయారయ్యి, ప్రజలకు శక్తినిచ్చేది ఆహారం. అలాంటి ఆహారాన్ని ఆరోగ్యవంతమైనదిగా అందించేందుకు ‘జగత్ ప్రసూ’ అనే పేరుతో ‘జేపీ ఆగ్రో అండ్ ఫుడ్స్ స్టార్టప్ కంపెనీ’ని స్థాపించారు కాత్యాయని. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలదాకా పలు బ్రాంచీలను విస్తరింప జేసుకుంది. ఇంతకీ ఆమెకు ఈ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చిందో, దాని కోసం ఆమె పడిన శ్రమ గురించి ఆమె మాటల్లోనే…
విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవితాన్ని హాయిగా గడపాల్సిన మీరు ఈ వ్యవసాయ రంగలోకి ఎందుకు వచ్చారు?
ఉమ్మడి కుటుంబం, వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి పెరిగిన మాకు వ్యవసాయం చిన్నప్పటి నుండి పరిచయమే. చిన్నతనం నుండి నేను పెరిగిన వాతావరణం ఏదో ఒకటి సాధించాలి అనే ప్రేరణ కలిగించింది. చదువుకుని విదేశాలకు వెళ్ళినా అంత తప్తి కలుగలేదు. ఇండియా వచ్చాక మా మూడు తరాల పెద్దలు చేసిన వ్యవసాయాన్ని అనుభవంగా తీసుకుని కొత్త పద్దతులను అవలంభించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే జేపీ ఆగ్రో సంస్థను కొత్తగా ప్రారంభించాను. మా సంస్థ ద్వారా పంటలు పండించడంతో పాటు రైతులను దళారీల నుండి రక్షిస్తూ మధ్యవర్తులు లేకుండా మార్కెటింగ్ చేయించే కృషి చేయాలనుకున్నాను. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలనే లక్ష్యంతో కూడా ఈ సంస్థను స్థాపించాను.
ఈ రంగంలో మీ అనుభవాలు, సమస్యలు ఏమిటి?
మా అనుభవాలు అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలు తయారు చేసుకోవడం, సేంద్రియ వ్యవసాయాన్ని, ప్రకతి సిద్ధమైన కర్బనం కలిగిన మొక్కల, జంతు, నీటి వ్యర్థాలు, ఇతర జీవపదార్థాలతో పాటు జీవన ఎరువులను ఉపయోగించడం. నేలలోని పోషకాలతో పంటలకు సమగ్రంగా అందే విధంగా చేయడం, సుస్థిర వ్యవసాయ దిగుబడులను సాధించడం. తద్వారా నేల, నీరు, వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడుతూ నేల సజీవంగా ఉండే విధంగ చూడడం. ఇలాంటి పంటలను పండించడంలో రైతులకు శిక్షణ ఇస్తాం. ఆరోగ్యకరమైన, విషరహిత, నాణ్యమైన పంటలను దిగుబడి చేస్తాం. అలాగే పండిన పంటలను మధ్యవర్తి లేకుండా డైరెక్ట్‌గా రైతు నుండి వినియోగదారునికి అందించే విధంగా చూస్తున్నాం. ఇక సమస్యలు అంటే సాధారణంగా ఫండ్ జెనరేట్ చేయడం, వర్కింగ్ కాపిటల్ అలాగే మార్కెటింగ్, ప్రమోషన్ చేయడం వంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి మా జెపి ఆగ్రో కంపెనీ జెడ్ సర్టిఫైడ్ కంపెనీగా గుర్తింపు పొందింది.
మహిళా సాధికారత పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
జీవితమంటేనే ఒడిదుడుకుల మయం. ఇంక మహిళల పరిస్థితి చెప్పనక్కరనేలేదు. అన్ని అనుభవాల నుండి జీవితాన్ని సవాలుగా తీసుకుని నిలదొక్కుకోవాలి. ఎవరో వస్తారని సాయం అందిస్తారని ఎదురు చూడకుండా మనం మాత్రమే చేయగలం అనుకుంటే సాధించలేనిది ఏదీలేదు. ముందు మనలో ఒక జీల్ ఉండాలి. ఆలోచించి శక్తి అనుసారం అభివద్ధి పథం వైపు నడవాలి. అప్పుడు విజయాలు ఒక విస్పోటంలా వరిస్తాయి.
మీరు సాధించిన విజయాలు ఏమిటి, మీకు సహకారం అందించిన వారు..?
మా సంస్థ ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులైన పసుపు, మసాలా దినుసులు, గానుగ నూనెలు, సైంధవలవణం, ఇంగువ, చిరుధాన్యాలు, తేనె వంటి ఇరవైరకాల పంటలు పండిస్తున్నాం. వీటన్నింటినీ ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. నాబార్డ్ వారి సహకారంతో విలువ ఆధారిత జోడింపుతో రెండు వందల మంది గిరిజన రైతులకు శిక్షణను ఇచ్చి వారు పండించిన పంటను జెపీ ఆగ్రో కంపెనీ ద్వారా మార్కెటింగ్ చేయిస్తున్నాం. కెవైసీ, పీయంజీపీ ద్వారా ఫండ్ అందేలా చూడటం, ఉమెన్ ఎక్స్‌పోలో ప్రోత్సాహం అందుకోవడం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం పొదడం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘న్యూ ఇన్నోవేటివ్ థాట్ బెస్ట్ ఉమెన్ స్టార్టప్ కంపెనీ అవార్డు’ అందుకున్నాను.
వి హబ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
వి హబ్ మహిళలకు చక్కటి మద్దతును ఇచ్చే సంస్థ. వి హబ్ లాంచ్ పాడ్ సర్వీస్‌లో నాకు సభ్యత్వం ఉంది. బిజినెస్ చేసే మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య మార్కెటింగ్. కాబట్టి వీరు మార్కెటింగ్‌లో సహాయం చేస్తున్నారు. వీరి సహకారంతోనే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలకు మా ప్రోడక్ట్స్ అందజేయ గలుగుతున్నాం
– రమాదేవి బాలబోయిన