ఉపాధ్యాయ ఉద్యమ చుక్కాని పివి సుబ్బరాజు

PV Subbaraju is the helmsman of the teacher movementఉపాధ్యాయ ఉద్యమ నేత పి వి సుబ్బరాజు 1917 మార్చి 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు గ్రామంలో జన్మించారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఎంతో చైతన్యం కలిగిన గ్రామం అది. అక్కడే ఎలిమెంటరీ స్కూల్‌, పాలకొల్లు మున్సిపల్‌ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. విద్యార్ధి దశలోనే కాంగ్రెసులో చేరి స్వాతంత్రోద్యమంలో పాల్గొ న్నారు. అప్పుడే దేశంలో ప్రవేశిస్తున్న సోషలిస్ట్‌ భావాల పట్ల ఆకర్షితులు అయ్యారు. తర్వాత కాంగ్రెసు సోషలిస్ట్‌ పార్టీలో చేరారు. పాలకొల్లులో విద్యార్ధిగా ఉన్నప్పుడే అప్పటి ప్రముఖ కాంగ్రెసు నాయకుడు ఉద్దరాజు రామం, భీమవరం సభలో కమ్యూనిస్ట్‌ నేత పుచ్చలపల్లి సుందరయ్య గార్లతో పరిచయం అయ్యింది. ఉపాధ్యాయుడుగా ఉంటే తన భావాలను మరింత వ్యాప్తి చేయవచ్చుననే భావనతో టీచర్‌ ట్రైనింగ్‌లో చేరి ఉపా ధ్యాయ వత్తి చేపట్టారు. కమ్యూనిస్ట్‌ పార్టీలో ఎన్ని విభేదాలు, చీలికలు వచ్చినా తొలినాళ్లలో పరిచయం అయిన సుందరయ్య, రామం గారి బాటలోనే చివరి వరకు నిలబడ్డారు.
ఒక వైపు ఉపాధ్యాయు డుగా పనిచేస్తూ స్వాతంత్రో ద్యమంలో చురుకుగా పాల్గొ న్నారు. అదే క్రమంలో 1942 తణుకు సమావేశం లో ఉద్దరాజు రామం, పర కాల పట్టాభిరామారావు, భూప తిరాజు లక్ష్మీనరసరాజులతో పాటు సుబ్బరాజును అరెస్ట్‌ చేసి తాడే పల్లిగూడెం జైల్లో నిర్బందించారు. సుబ్బరాజు మంచి ఉపాధ్యా యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సుబ్బరాజు మాస్టారు గాను కమ్యూనిస్ట్‌ సుబ్బరాజు గాను పేరుగాంచారు. ఆయన కమ్యూ నిస్ట్‌ అని ఓర్వలేని కాంగ్రెస్‌ వారు అనేక దూర ప్రాంతాలకు బదిలీ చేయించే వారు. ఆయన మొత్తం సర్వీసులో జిన్నూరు, వాలమర్రు, రాయకుదురు, గణపవరం, వెంప, సిద్దాంతం, వీరవాసరం, యలమంచిలి తదితర దూర ప్రాంతాలకు బదిలీ చేయబడ్డారు. వెళ్ళిన ప్రతిచోట ఒకవైపు ఉత్తమ ఉపాధ్యా యునిగా పేరు తెచ్చుకోవడం, మరొక వైపు అభ్యుదయ భావాల బీజాలు నాటడం, రెండో విషయాన్ని సహించలేక గ్రామ పెద్దలు ఆయన్ని బదిలీ చేయించడం, విద్యార్ధులు దాన్ని వ్యతిరేకించడం ప్రతి సందర్బంలోను జరిగేది. గ్రామగ్రామాన సైకిల్‌ మీద తిరుగుతూ ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించారు. ఉద్యమాల్లో రాటుదేలి ఉపాధ్యాయుల హదయాల్లో చెరగని ముద్రవేసిన సుబ్బరాజు నిరాడంబరత, నిక్కచ్చితనం, ఉద్యమ నిర్మాణ దక్షత ఆయన సొత్తు.
నిద్రాణంలో వున్న పశ్చిమగోదావరి జిలా టీచర్స్‌ గిల్డ్‌ను పునరుజ్జీవింప చేసి, జిల్లా కార్యదర్శిగా ఎన్నికై సుదీర్ఘ కాలం పని చేశారు. ఏపీ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్రశాఖకు ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా సేవలందించారు. మహాసభలు నిర్వహించడంలో ఆయన అందెవేసిన చేయి. ఏపీ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభలను 1961లో ఏలూరులో, మరొకసారి తాడేపల్లి గూడెంలో జయప్రదంగా నిర్వహించారు. యాభై ఏళ్ల ప్రజా జీవితంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహించారు. ధరించే దుస్తులు మొదలు జీవనశైలి వరకు కమ్యూనిస్ట్‌తత్వం అడు గడుగునా కనిపించేది. సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రగతి శీల ఉద్యమాలలో భాగస్వామై కష్టాలను లెక్కచేయక, నమ్మిన ఆశయానికి కట్టుబడి జీవితాంతం అచంచలంగా నిలచిన ధన్యజీవి. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత చెన్నుపాటి లక్ష్మయ్య గారికి సుదీర్ఘ సన్నిహిత ఉద్యమ సహచరుడు. ఉద్యమ నిర్మాణం కోసం ఎన్నో అగ్ని పరీక్షల్లో చలించకుండా నిలబడిన వ్యక్తి. అధ్యయనం, అనుభవం, ఆచరణ వల్ల ఏర్పడిన కచ్చి తమైన నిర్దిష్టమైన రాజకీయ విశ్వాసాలు కలిగి ఆశయానికి ఆచరణకు తేడా లేకుండా జీవించిన ఆదర్శజీవి సుబ్బరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా ఉద్యమాలకు అండదండ లందిస్తూ క్రియాశీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమాన్ని విస్తత పరిచేందుకు విశేష కషి చేశారు. సాత్వి కుడుగా పేరు పొందారు. ఉద్యమమే ఊపిరిగా తుది శ్వాస వరకు ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితమై విశేష కషి చేసిన కమ్యూనిస్ట్‌ పార్టీ ముద్దుబిడ్డ సుబ్బరాజు.
అన్ని ప్రాంతాల, అన్ని మేనేజిమెంట్ల, అన్ని కేడర్ల సమైక్య సంఘంగా చారిత్రక అవసరంగా 1974 ఆగస్టు 10న ఏర్పడిన సంస్థ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటియఫ్‌) ఆవిర్భావం లో కూడా సుబ్బరాజు పాలు పంచుకున్నారు. యూటియఫ్‌ ప్రధమ మహాసభలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు నిర్వర్తించారు. వెంటనే విజయవాడకు మకాం మార్చి ఆఫీసు కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. ఐక్యఉపాధ్యాయ పత్రికకు సంపాదకవర్గ సభ్యునిగా కొంతకాలం పని చేశారు. జీవితంలో ఎన్నో ఒడి దుడుకులను చవిచూశారు. ఆర్దికంగా, ఆరోగ్య పరంగా అనేక కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆశయ సాధన, ఉద్యమాల్లో ఏనాడూ వెనకడుగు వెయ్యలేదు. కుటుంబం ఎంతో కష్టదశలో ఉన్నా నైతిక ప్రమాణాలు విడిచి పెట్టలేదు. పార్టీ గాని యూనియన్‌ గాని ఇచ్చిన ప్రతి బాధ్యత నిర్వహించడంలో శెభాష్‌ అనిపించు కొనేవారు. తన ఐదు దశాబ్దాల ఉద్యమంలో త్యాగం, శ్రమ, విలువలు, క్రమశిక్షణ ఆయన మిగిల్చిన ఆస్తులు. ఆయన జీవితం, ఉద్యమ కషి, నమ్మిన ఆశయం పట్ల నిబద్ధత, భవిష్యత్‌ తరాలకు స్పూర్తి దాయకం. 1983 డిసెంబర్‌ 15 న సుబ్బరాజు హైదరాబాదు నిమ్స్‌ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన కుమారులు పి.లచ్చిరాజు (బిఎస్‌ఎన్‌ఎల్‌, విశాఖపట్నం), పి.విష్ణు (బ్యాంకింగ్‌, హైదరాబాదు) కూడా ఇప్పటికీ అభ్యుదయ ఉద్యమాలకు అండదండలు అందిస్తున్నారు. ఏలూరులో యూటియఫ్‌ జిల్లా కార్యాలయానికి ”పి వి సుబ్బరాజు టీచర్స్‌ హోమ్‌” అని పేరు పెట్టి ఆయన నిబద్దతకు, సేవలకు శాశ్వత రూపం ఇచ్చారు. సుబ్బరాజు వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ సమసమాజ నిర్మాణానికి ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.
(నేడు కామ్రేడ్‌ పివి సుబ్బరాజు 40వ వర్ధంతి)
– పి.విష్ణు

Spread the love