సర్వేలు

Surveys”ఏమిటి రామయ్యా ఇంటి ముందు కూర్చుని ధీర్ఘంగా ఆలోచిస్తున్నావు” అంటూ వచ్చాడు రాజయ్య.
”ఆ ఏముందీ ! సర్వే చేయటానికి ఎవరూ రాలే దేమిటా? అని ఆలోచిస్తున్నాను” అన్నాడు రామయ్య.
”ఏమిటి మీ పొలం సర్వే చేయిస్తున్నావా? నాకు చెబితే నేనూ చేయించేవాడిని కదా ! అన్నాడు రాజయ్య
”నా పొలం సర్వే చేయించటం లేదు. ఎన్నికల సర్వేలు చేస్తున్నారు కదా! మన వద్దకు వచ్చి ఏదో అడు గుతారు కదా ఆ సర్వే” అన్నాడు రామయ్య.
”అలాంటి సర్వేలు ఇప్పుడెవరు చేస్తు న్నారు? అంతా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లోనే జరిగిపోతుంది. అంతే!” అన్నాడు రాజయ్య.
”మరి నాకు ఫేస్‌బుక్‌ లేదు కదా ! వాట్సప్‌ కూడా నేను వాడను. మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి?” అన్నాడు రామయ్య.
”నీకు ఎవరైనా ఫోన్లు చేసి, ఎవరికి ఓటు వేస్తావ్‌ అని అడిగారా?” అన్నాడు రాజయ్య.
”ఏదో రెండు మూడు ఫోన్లు వచ్చాయి!” అన్నాడు రామయ్య.
”అందులో ఏమేమి అడిగారు?” అన్నాడు రాజయ్య.
”ఈసారి ఫలానా పార్టీకి, ఫలానా కాండిడేట్‌కి ఓటు వేస్తావా? అంటూ ఒక్కొక్కరు ఫోన్‌లో ఒక్కో పార్టీ గురించి అడిగారు!” అన్నాడు రామయ్య.
”దానికి నువ్వేమన్నావు?” అన్నాడు రాజయ్య,
ఆ పార్టీకే ఓటెందుకు వేయాలి అని అడిగాను!” అన్నాడు రామయ్య.
”దానికి వాళ్ళేమన్నారు?”అన్నాడు రాజయ్య.
”మనం 80 శాతమన్నా! మన మోదీ టీ20 సభలు జరిపారన్నా అందుకే ఓటు వెయ్యాలన్నా. అని ఒకరు, మన తెలంగాణ కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించింది. కనుక పులిలాంటి కేసీఆర్‌కి ఓటు వేయా లని మరొకరు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఇంకొ కరు అడిగారు” అన్నాడు రామయ్య.
‘ఇదంతా సర్వేలో భాగమే కదా!” అన్నాడు రాజయ్య
”మొత్తం విను రాజన్నా ! మన 80 శాతం పై గ్యాస్‌ బండ ధర పెరి గిందని, ఏడాదికి రెండు కోట్లు ఉద్యో గాలు ఇస్తామని అన్నారు కదా! ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అందులో మన 80 శాతం హిందువులకి ఎన్ని ఇచ్చారు అని అడిగాను.! కాని వాటికి సర్వే చేస్తున్న వారు సమాధానం చెప్పలేదు.!” అన్నాడు రామయ్య.
”మరి ఇంకో సర్వేకు ఏమి చెప్పావు!” అన్నాడు రాజయ్య నవ్వుతూ.
‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తా మంటరి కదా! ఎంత మందికి పంచారు? ఆశాలు, అంగన్‌వాడీలు, గ్రామ సేవకులు మాకు జీతాలు పెంచండి మహాప్రభో అంటూ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు! తెలంగాణా వస్తే ధర్నాలే ఉండవంటిరి ! మరి ధర్నా లేని ఊరు గాని, ధర్నా జరగని రోజుగాని లేదు కదా. ఇదేనా కనీవినీ ఎరుగని అభివృద్ధి!” అని అడిగాను దానికి సమాధానం చెప్పలేదు! అన్నాడు రామయ్య.
ఈసారి రాజయ్య గట్టిగా నవ్వాడు.
”ఎందుకు నవ్వుతావు”! అన్నాడు రామయ్య.
”నేనడిగింది తమషాగా అన్పించిందా?” అన్నాడు రామయ్య.
”ఇందులో తమాషా ఏమీ లేదు! ఆయితే సర్వేలో ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ప్రశ్నలు వేస్తారు! కావి నీవే ప్రశ్నలు వేశావు ! అందుకే నవ్వు వచ్చింది!” అన్నాడు రాజయ్య.
”ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు సర్వే చేశారు, నిజమే. కాని ఎవరైనా గెలవాలన్నా, ఓడాలన్నా నా ఓటు ముఖ్యం కదా!” అన్నాడు రామయ్య..
”నీ ఓటు ముఖ్యమైనందు వల్లనే నిన్ను సర్వే చేస్తున్నారు!” అన్నాడు రాజయ్య.
”అదీ అసలు సంగతి! నా ఓటు ముఖ్యమైనపుడు, నన్ను సర్వే చేసినపుడు, నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. కాని, నన్నే ప్రశ్నలు అడిగితే ఎట్లా?” అన్నాడు రామయ్య.
రాజయ్యకు ఏమీ అర్ధం కాలేదు!
”ఇందులో గడ్బడ్‌ ఏమీ లేదు! ఎన్నికల్లో నా ఓటు కావాలని అనుకుంటే, ఎన్నికల కన్నా ముందు అంటే ఐదేండ్లు నా కోసం ఈ పార్టీలు ఏం చేశాయని వారు చెప్పుకుంటే చాలదు. వారు ఏం చేశారు! ఆ చేసినదాని వల్ల నాకు జరిగిన ప్రయోజనం ఏమిటీ? ఒక ఓటరుగా నేను సంతృప్తి చెందానా…లేదా? అన్న విషయాలు సర్వేలో అడగాలి కాని, ఫలానా పార్టీకి ఓటు వేస్తావా? ఫలానా క్యాండేటుకు ఓటేస్తావా? ఫలానా మతానికి, ఫలానా కులానికి ఓటేస్తావా? అని సర్వే చేస్తే ఎట్లా?” అడిగాడు రామయ్య.
నిజమేనన్నట్లు రాజయ్య తల ఊపాడు.
”సర్వే ఎన్నికల ముందు చేయటం కాదు! ప్రతి ఏడాది చేయాలి. ఆ సర్వేలో నీకు ఉపాధి ఉందా? ఉంటే కూలి ఇస్తున్నారా? పెరిగిన ధరలకు తగినట్లు కూలి పెంచుతున్నారా? రైతులకు గిట్టుబాటు ధర అందుతుందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకు తున్నవా? దొరికితే ఉద్యోగభద్రత ఉందా? కార్మికులకు, ఉద్యోగులకు హక్కులు అమలు అవుతున్నాయా? అమ లుచేయని యజమానులపై చర్యలు ఉన్నాయా? మహి ళలకు భద్రత ఉందా? ఇలాంటివి సర్వే చెయ్యాలి!” అన్నాడు రామయ్య.
”ఇలాంటి సర్వేలు కొన్ని సంస్థలు చేసి ఫలితాలు ప్రకటిస్తుంటాయి కదా!” అన్నాడు రాజయ్య.
”కాని ఆ సర్వేలను ఎవ్వరూ పట్టించుకోరు. కొందరు కష్టజీవుల పక్షపాతులైన మేధావులు మాత్రం ఆ లెక్కల గురించి మొత్తుకుంటారు! కాని ప్రభుత్వాలు ఏనాడైనా పట్టించుకున్నాయా? గతంలో ఎన్నికలపై సర్వేలు కొన్ని సంస్థలు జరిపేవి! ఇప్పుడు పార్టీలే డబ్బు లిచ్చి సర్వే చేయించుకుంటున్నాయి!” అన్నాడు రామయ్య
”అందులో తప్పేముంది?” అడిగాడు రాజయ్య. ”ఇది తప్పొప్పుల సమస్య కాదు! ఓటర్ల కష్ట సుఖాల సర్వేలు, వాటి ఫలితాల గురించి పాలక పార్టీలు పట్టించుకోవు. కానీ తాము అధికారంలోకి రావటానికి మాత్రం సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నాయి. అధికారం మీద ఉన్న శ్రద్ధ ఓటర్ల మీద లేదంటాను! నువ్వేమంటావు!” అన్నాడు రామయ్య
” 100శాతం కరెక్ట్‌” అన్నాడు రాజయ్య.
ఉషాకిరణ్‌

Spread the love