నేటినుంచి జయశంకర్‌ బడిబాట

– 19 వరకు నిర్వహణ
– సవరణ మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గురువారం నుంచి జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈనెల 19 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సవరణ మార్గదర్శకాలను బుధవారం జారీ చేశారు. అనంతరం సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ మల్లయ్య బట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల మూడు నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట కార్యక్రమం గురువారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అన్ని ఆవాసాల్లో బడిఈడు పిల్లలను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచాలనీ, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు (ఏఏపీసీ) సహాయం తీసుకుని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో బడిఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌ (వీఈఆర్‌)ను అప్‌డేట్‌ చేయాలనీ, పర్మినెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌ (పీఈఎన్‌)ను అప్‌డెట్‌ చేయాలని కోరారు.
ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఆరో తరగతి, ఎనిమిదో తరగతిలో చేర్పించాలని వివరించారు. తక్కువ పిల్లలున్న పాఠశాలలను గుర్తించి వాటిలో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని డీఈవోలు, ఆర్జేడీలు, సమగ్ర శిక్ష ప్రాజెక్టుఅధికారులను ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలనీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సహాయంతో వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలని పేర్కొన్నారు. బాలికల విద్య ప్రాముఖ్యతను గుర్తించాలనీ, బాలికల నమోదును పెంచాలని కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పౌరసమాజంలో విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) గురించి అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రుల పాత్ర గురించి వివరాలనీ, పేరెంట్‌ టీచర్‌ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం అందించే ద్విభాషా పాఠ్యపుస్తకాల పంపిణీ, నోట్‌ పుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి వాటిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డిజిటల్‌ తరగతి గదులు, ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం గురించి వివరించాలని తెలిపారు. ఇంటింటా చదువుల పంట వంటి కార్యక్రమం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. ఈనెల పదో తేదీ వరకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, ఒక జత యూనిఫారం విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పూర్తి చేయాలని కోరారు.

Spread the love