త్వరలో క్యాబినెట్ సబ్‌కమిటీ నివేదిక
హెల్త్ కార్డులు ఇస్తాం
ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసివేయం
బోధి పెవిలియన్ నా క్యాంప్ ఆఫీస్
అధికారిక సమావేశాలకే ఉపయోగిస్తాం
మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టుల ఇండ్లస్థలాల ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. క్యాబినెట్ సబ్‌కమిటీ కసరత్తు త్వరలో పూర్తవుతుందని చెప్పారు. జర్నలిస్టులకు కచ్చితంగా ఇండ్లస్థలాలు ఇస్తామని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం బోధి పెవిలియన్‌లో సమకాలిన రాజకీయాలు, జర్నలిస్టుల సమస్యలు, బీఆర్‌ఎస్, బీజేపీల విమర్శలకు సంబంధించి మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. పాత్రికేయుల అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 2026లోనే ఇండ్లస్థలాలను ఇవ్వాలని జర్నలిస్టులు సీఎంను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. క్యాంపు కార్యాలయం బోధి పెవిలియన్ మొత్తాన్ని మీడియాకు తిప్పి చూపించారు. లోపలి గదులు, వాష్‌రూమ్‌లు, లాన్‌లకు సంబంధించి వివరాలను మీడియాకు చెప్పారు. ‘ఇది నా క్యాంపు ఆఫీస్. అధికారిక సమావేశాలు నిర్వహిస్తాం. జడ్జీలతో సమావేశాలు ఇక్కడే జరుగుతాయి. వాళ్లను ఇంటికి రమ్మనడం భావ్యం కాదు. అందుకే అధికారిక కార్యకలాపాలకే బోధి పెవిలియన్‌ను వాడుతున్నాం’ అని సీఎం చెప్పారు. దీనికి ఇనుప కంచెలేవీ పెట్టలేదన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని వాడుకోని కొంత భాగాన్ని ఉపయోగంలోకి తెచ్చామని వివరించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదన్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ బెడ్‌రూమ్‌లు, ఇతర గదులుగాని లేవన్నారు. చెట్లతో ఆహ్లాదకరంగా మార్చామనీ, అందరి కోసం ప్రత్యేకంగా పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతల ప్రచారం రాజకీయమైనదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్నదనీ, లొంగిపోవడానికి కాదన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలను 17 వేల నుంచి నాలుగు వేలకు కుదిస్తారనే ప్రచారం జరుగుతున్నదని విలేకరులు అడగ్గా ‘ ఒక స్కూల్‌ను కూడా మూసేయం.. అవసరం లేని వాటిని అవసరమున్న చోటికి తరలిస్తాం. ఇది కూడా నిర్ణయం చేయలేదు. ప్రయోగం చేస్తున్నాం. సర్వ సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు అందుకే ఏర్పాటు చేస్తున్నాం..చివరకు రవాణా సదుపాయం కోసం కూడా విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్నదే తమ ఉద్దేశం’ అని చెప్పారు. స్కూళ్లను మూసివేసే పరిస్థితి ఉండదని తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి చదువుకోవడానికి విద్యార్థులు హైదరాబాద్ వస్తున్నారనీ, వారి పిల్లల కోసం మండలానికి ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని అన్నారు. నారాయణ, శ్రీచైతన్య స్కూళ్ల దగ్గర కమీషన్లు వసూలు చేసుకునే వాళ్లు బీఆర్‌ఎస్ నేతలేనని ఆరోపించారు. చివరకు క్రషర్లను కూడా వదలడం లేదని విమర్శించారు. ఆంధ్రోళ్లకు పాలు పోసే బతుకు హరీశ్‌రావుదని వ్యాఖ్యానించారు. తుంగభద్ర డ్యామ్‌లో గేట్ల ప్రారోంభోత్సవం సందర్భంగా మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని తెలిపారు. సీఎంల సమావేశంలోకి ఇతరులను అనుమతించరనే విషయం బీఆర్‌ఎస్ నాయకులకు తెలియదా ? అని ప్రశ్నించారు.
జర్నలిస్టుల ఇండ్లస్థలాల ప్రక్రియ కొలిక్కి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



