Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరజక వృత్తిదారులకు రక్ష‍ణ చట్టం ఏర్పాటు చేయాలి

రజక వృత్తిదారులకు రక్ష‍ణ చట్టం ఏర్పాటు చేయాలి

- Advertisement -


టీఆర్‌‌వీఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిదారుల రక్ష‍ణ చట్టాన్ని వెంటనే రూపొందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (టీఆర్‌‌వీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య డిమాండ్‌ ‌చేశారు. శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారుల సమస్యలపై సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన మూడు నెలల్లో రజక వృత్తిదారులపై దాడులు దౌర్జన్యాలు, మైనర్ బాలికలపై లైంగికదాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వాములు, పెత్తందారులే ఈ దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర, ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామం, రంగారెడ్డి జిల్లా షాబాద్లో మైనర్ బాలికలపై లైంగికదాడులు జరిగాయన్నారు. కాంగ్రెస్‌ ‌కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌లో రజకవృత్తి దారుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు రూ. 10 లక్షల వరకు ఆర్థికసాయం, ప్రతి జిల్లాలో రూ. 10 కోట్లతో మోడరన్ ధోబిఘట్ల నిర్మాణం, చేస్తామని వాగ్దానం చేసిందని తెలిపారు. ప్రతియేట బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్ల నిధులు, బడ్జెట్‌‌లో కల్పిస్తామని చెప్పిన మాట నీటిమూట లాగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ డిక్లరేషన్ అమలు కోసం గ్రామ, గ్రామాన రజక వృత్తిదారులను చైతన్యం చేస్తామని తెలిపారు. సభలు, సమావేశాలు, సర్వేల ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, మరియాల గోపాల్, పాయిరాల రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు సి.వెంకటస్వామి, కె.యాదగిరి, యాదమ్మ, సీహెచ్‌. నాగేష్, మైలారం వెంకటేశ్వర్లు, ముదిగొండ రాంబాబు, జంగయ్య, పెద్దాపురం భాస్కర్, యాదాద్రి అవనగంటి స్వామి, బాతరాజు యాదగిరి, కానుగు శివ, నల్లగొండ జిల్లా నాయకులు ఐతరాజు యాదయ్య, రుద్రారపు పెద్దులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -