– కాంట్రాక్టర్లకు గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆదేశం
అహ్మదాబాద్ : తమది కమిషన్ల ప్రభుత్వమని గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేష్‌భారు చోటూభారు పటేల్ నిస్సిగ్గుగా చెప్పారు. బీజేపీ వ్యవస్థలో రెండు శాతం కమిషన్ల పద్ధతి ఉన్నదని, అంతకంటే ఎవరికీ ఎక్కువ ఇవ్వవద్దని ఆయన ప్రభుత్వ జాబ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. నవసారి జిల్లాలోని విజల్‌పోర్ ప్రాంతంలో ఓ సరస్సు సుందరీకరణ ప్రాజెక్టుపై జరిగిన చర్చ సందర్భంగా బహిరంగ వేదిక పైనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా కాషాయ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని అంగీకరించారు. ఈ ప్రాజెక్టుకు నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అంటూ రెండు శాతానికి మించి ముడుపులు ఇవ్వవద్దని కాంట్రాక్టర్లకు సూచించారు. పటేల్ ప్రకటనపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. బీజేపీ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతోందని ఆరోపించింది. గతంలోనూ బీజేపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, అయితే ఇప్పుడు ఆ పార్టీ నేతలు దానిని బహిరంగంగా అంగీకరించారని వ్యాఖ్యానించింది.