Friday, September 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురూ.250 కోట్ల విలువైన భూమికి రూ.7 కోట్లా?

రూ.250 కోట్ల విలువైన భూమికి రూ.7 కోట్లా?

- Advertisement -

బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎక్కడికి పోయాయి
సీఎం అన్నదమ్ములకు రూ.వందల కోట్ల విలువైన భూములా.. !
ప్రజా సంక్షేమానికి పైసల్లేవా.. దొంగలను పట్టాల్సిన హోంమంత్రి అమిత్‌ ‌షా ఎక్కడ?
ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం : బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి టెస్సెరాక్ట్‌ కంపెనీకి కేటాయించిన భూమి వద్ద బీఆర్ఎస్‌ నిరసన

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సీఎం రేవంత్‌‌రెడ్డి తమ్ముడు కొండల్‌ రెడ్డి టెస్సెరాక్ట్‌ ‌కంపెనీకి రూ.250 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘ఈడీ, ఐటీ, సీబీఐలు మాపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు కనిపించడం లేదా’ అని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలో కొండల్‌ రెడ్డి టెస్సెరాక్ట్‌ ‌కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూములను గురువారం కేటీఆర్‌ నేతృత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని చెబుతున్నారు. మరి తెలంగాణను కొల్లగొడు తున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన హోంమంత్రి ఎక్కడున్నారు…? ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. సీఎం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం అధికార దుర్విని యోగం కాదా, ప్రయోజనాల సంఘర్షణ కాదా, కుటుంబ పాలన కాదా అని ఆయన నిలదీశారు. ఎనుముల జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన సంస్థకు రూ.1,000 కోట్ల పెట్టుబడి పేరుతో ప్రభుత్వ రాయితీలు, భూము లు, మినహాయింపులు కల్పించే వ్యవహా రంపైనా ప్రశ్నలు సంధించారు.

సీఎం సోదరుడి సంస్థ ఇజ్రాయిల్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌తో చేసుకున్న ఒప్పందంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయని అన్నారు. ఈ రంగంలోనూ అధికారానికి దగ్గరగా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు కూడా ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. శాసనసభలో ఈ భూకేటాయింపులు, ఫ్యూచర్‌ సిటీ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తామనే తమను సస్పెండ్‌ చేసి బయటకు పంపారని ఆరోపించారు. అందుకే మీ తమ్ముడికి ఇచ్చిన భూమి వద్దకే వచ్చామని, ఇక్కడి నుంచే ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాయా జాలం నడుపుతున్నదని ఆరోపించారు. గతంలో ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగిందని, ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగిం చడం చట్టపరంగా ప్రశ్నార్థకమని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -