ఆదిలాబాద్‌లో కమలందే విజయం

ఆదిలాబాద్‌లో కమలందే విజయం– పోరాడి ఓడిన కాంగ్రెస్‌
– సరైన నాయకత్వం లేకున్నా.. సీతక్క ఆధ్వర్యంలో ప్రచారం
– డిపాజిట్‌ కోల్పోయిన బీఆర్‌ఎస్‌
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ మరోసారి విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై బీజేపీ నుంచి బరిలో దిగిన గోడం నగేష్‌ 90,932ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ లోక్‌సభ స్థానంలో 12,21,563 ఓట్లు పోల్‌ కాగా, 12మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు 4,71,220ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌ 5,58,103 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కు కేవలం 1,36,380 ఓట్లను సాధించి డిపాజిట్‌ కోల్పోయారు. వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయారు. వీరు కేవలం 10వేల ఓట్లలోపే పరిమితం కాగా, నోటాకు మాత్రం 11,743ఓట్లు రావడం విశేషం. పోస్టల్‌ ఓట్లలోనూ బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. బీజేపీకి 9232ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థికి 5183ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 837ఓట్లు వచ్చాయి. ఇందులో 841ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం.. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నాలుగు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం. రెండు చోట్ల బీఆర్‌ఎస్‌, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకత్వం లేదు. మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకుని కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేశారు. స్థానిక నాయకత్వం గట్టిగా లేకపోవడం కూడా కాంగ్రెస్‌ ఓటమికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఓట్లు క్రాస్‌ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

Spread the love