గురువాక్కులలో కమ్మదనం

చంద్రుని వెలుగు చల్లదనం… సూర్యుని వెలుగు వెచ్చదనం… గురువాక్కులలో కమ్మదనం’ అంటారు ఓ గేయ రచయిత. నిజమే గురువుల వాక్కుల్లో అంతటి బలం వుంటుంది మరి. కల్మషమెరుగుని పసి వయసులో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ పొరపాట్లు చేస్తే సరిదిద్దుతూ మనల్ని మంచి మనిషులుగా తీర్చిదిద్దుతారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర అత్యంత ముఖ్యమైనది. పిల్లల ఆలోచనలను ప్రభావితం చేయగలిగే శక్తి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉంటుంది. గురువులంటే పిల్లలకు గౌరవంతో కూడిన ఓ భయం ఉంటుంది. అదే వారిని మంచి మార్గంలో నడిచేలా చేస్తుంది. అందుకే మన భవితకు బంగారు బాటలు వేసిన గురువులను గౌరవించుకునేందుకు డా.సర్వేపల్లి రాథాకృష్ణన్‌ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పిల్లలు తమకు తెలియని ఓ అందమైన కొత్త ప్రపంచాన్ని తరగతిగదిలోనే చూస్తారు. అది ఆ గది గొప్పదనం కాదు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులది. పిల్లల ఆలోచనా ధోరణి మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకు వుంటుంది. దేశ భవిత అభివృద్ధి పథంలో నడవాలంటే సామాజిక స్పృహ కలిగిన యువతతోనే సాధ్యం. అలా యువతను తీర్చే వారే ఉపాధ్యాయులు. అందుకే దేశ భవిత తరగతి గదుల్లోనే నిర్మిత మవుతుందంటారు. అందుకే మనకు జ్ఞానాన్ని అందించే గురువులు ఎప్పుడూ మనకు గొప్పవారే.
మన చుట్టూ ఎంతో మంది గొప్ప వ్యక్తులను చూస్తుంటాము. వీరందరిపై ఉపాధ్యాయుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అయితే మన జీవితంలో అటువంటి గొప్ప పాత్రను పోషించే గురువులను నేటి సినిమాల్లో జోకర్లుగా, ప్రేమ వ్యవహారాలు నడిపే రాయభారులుగా చూపిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా చేస్తున్నారు. ఇటువంటి సినిమాలను నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థుల్లో కూడా తమకు విద్యా బుద్దులు నేర్పే ఉపాధ్యాయులను గౌరవించాలనే ఆలోచన రావాలి.
జీవిత ప్రయాణంలో ఎంతో మంది వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. వారందరినీ మనం గుర్తు పెట్టుకోలేము. కానీ బడిలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. వారి ప్రభావం మనపై అంతగా ఉంటుంది. పసి వయసులో పిల్లల మనసుల్లో కొన్ని ఆలోచనలు చెరగని ముద్ర వేస్తాయి. ఎదిగే కొద్ది ఆ భావాలే జీవితంలో ఆచరిస్తారు. అవి మంచి ఆలోచనలైతే మంచి పౌరులుగా పిల్లలు తయారవుతారు. అటువంటి మంచి ఆలోచనలకు బీజాలు పడాలంటే అది కేవలం గురువుల వల్ల మాత్రమే సాధ్యం. విద్యార్థులు జ్ఞానంతో పాటు సద్గుణాలను తగతిగదిలోనే నేర్చుకుంటారు. అలాగే పిల్లలు వాస్తవికతని యథాతథంగా చూసేందుకు సహకరించేది కూడా ఉపాధ్యాయులే.
ఏది ఏమైనప్పటికీ ఉపాధ్యాయులు అంటే మనకు జ్ఞానాన్ని అందించేవారు. అయితే ఆ జ్ఞానం పురోగామి దిశగా ఉంటుందా, తిరోగామి దిశగా ఉంటుందా అనేదే ఇప్పుడు అసలు సమస్య. గురువులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నారా లేదా అని పరిశీలించుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేటి పరిస్థితులు ఆ వాతావరణం ఉపాధ్యాయులకు కల్పిస్తున్నాయా లేదా అనేది కూడా ఓ ప్రశ్నే. పిల్లల మధ్య ఐక్యతను పెంచాల్సిన ఉపాధ్యాయులే విద్వేషాలను రెచ్చగొడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరం. ఇటువంటి ధోరణులతో సమాజానికి తీవ్రమైన నష్టం. ఆ నష్టం జరగకుండా ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యత వహించాలి. మంచి పౌరులను సమాజానికి అందించాలి. గురువాక్కులలోని కమ్మదనాన్ని పిల్లలు మనసారా ఆస్వాదించాలి.

Spread the love