Friday, May 29, 2026
E-PAPER
Homeజాతీయంకర్నాటకం

కర్నాటకం

- Advertisement -

సీఎం సిద్ధరామయ్య రాజీనామా
ఎందుకు చేశారో చెప్పని కాంగ్రెస్‌ అధిష్టానం…డీకే శివకుమార్‌‌కు లైన్‌ క్లియర్‌‌?
అందుబాటులో లేని గవర్నర్‌…కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేత

బెంగలూరు : కర్నాటకలో కాంగ్రెస్‌ ‌మార్క్‌ ‌రాజకీయం మొదలైంది. పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నా, ఐదేండ్లు ఒకే వ్యక్తిని ముఖ్యమంత్రి సీట్లో కొనసాగించలేని నిస్సహాయస్థితిలో ఆపార్టీ నాయకత్వం ఉంది. దీనికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామానే ప్రత్యక్ష‍ సాక్ష్యం. ఆయన స్థానంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌ను సీఎం చేస్తారని ప్రచారం జరుగుతుంది. అసలు సిద్ధ రామయ్యతో ఎందుకు రాజీనామా చేయించారు అనే విషయంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటి వరకు నోరువిప్పలేదు. ఇలాంటి చర్యల వల్లే ఫాసిస్టు పార్టీలకు ఆయుధాలు ఇచ్చినట్టు అవుతున్నదని కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌ కార్యదర్శికి రాజీనామా లేఖ ను అందజేశారు. ఈ విషయాన్ని గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి సైతం ధ్రువీకరించారు. గవర్నర్‌ బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు లోక్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

రిటైర్మెంట్‌ తీసుకోను
‘‘జాతీయ రాజకీయాల్లోకి రావాలని హైకమాండ్‌ అడిగింది. రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసింది. కానీ, నేను సున్నితంగా తిరస్కరించా. జాతీయ స్థాయి రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. అయితే, రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు. ప్రజలు నన్ను ఐదేండ్ల కాలానికి ఎన్నుకున్నారు. ఇంకా రెండేండ్లు మిగిలి ఉన్నాయి. అప్పటివరకు ఎమ్మెల్యేగానే కొనసాగుతా’’ అని స్పష్టం చేశారు.

పొరపాటుగా రాజకీయాల్లోకి వచ్చా..
ఈ సందర్భంగా సిద్ధరామయ్య తన రాజకీయ ప్రస్థానాన్ని, గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చా. మా కుటుంబంలో అంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరు. 2006లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి హైకమాండ్‌ నన్ను ఆదరించింది. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రెండేసిసార్లు సేవలందించా. మ్యానిఫెస్టోలో ఇచ్చిన 160 హామీల్లో 158 నెరవేర్చా. మొదటి ఏడాదిలోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశా. నాపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయి. కానీ, నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. పదవి, డబ్బు కోసం ఏనాడూ పాకులాడలేదు’’ అని సిద్ధరామయ్య వివరించారు. సిద్ధరామయ్య గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తోంది. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రమాణస్వీకార కార్యక్రమంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు

అధిష్టానం ఆదేశాల మేరకే
కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్ఠానం సూచనలతో సీఎం పదవికి రాజీనామా చేశా. హైకమాండ్‌ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పదవి నుంచి వైదొలిగా. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా. దాన్ని గవర్నర్‌ ఆమోదిస్తారనే విశ్వాసం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉంది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్వహణలో నాకు సహకరించి న అందరికీ ధన్యవాదాలు. సీఎంగా నాకు అవకాశమి చ్చిన సోనియా, రాహుల్‌, ఖర్గేకు కృతజ్ఞతలు. అని సీఎం సిద్ధరామయ్య రాజీనామా అనంతరం మీడియాకు చెప్పారు. ఆ సమయంలో ఆయన వెంట మంత్రులు డీకే శివకుమార్‌, పరమేశ్వర ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -