బడ్జెట్‌కు సర్కారు కోత
సామాన్యుడి జేబుకు చిల్లు
నేషనల్ హెల్త్ అకౌంట్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశంలో సామాన్యుడికి వైద్యం మరింత భారంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య అవసరాల కోసం అప్పులు చేసి మరీ సొంత జేబుల నుండి ఖర్చులు చేయాల్సి వస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్‌హెచ్‌ఎ) 2022-23’ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత.. ప్రజా వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా గాలికొదిలేయడం వల్లే ప్రజలపై ఈ అదనపు భారం పడిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వాలు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నాయి. దీంతో దేశ మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు తమ సొంత నగదును ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. దేశ మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు సొంతంగా భరించే ఖర్చుల వాటా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 39.4 శాతంగాఉండగా.. 2022-23 నాటికి 43.4 శాతానికి పెరిగింది. కోవిడ్ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు డాక్టర్ల కన్సల్టేషన్లు, ల్యాబ్ పరీక్షలు, మందుల కొనుగోలు కోసం ప్రయివేటు రంగంలో ఎక్కువగా ఖర్చు చేయడమే దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
తగ్గిన నిధులు..
ప్రజల జేబులు గుల్లవడానికి ప్రధాన కారణం ఆరోగ్య రంగంలో ప్రభుత్వాల వ్యయాలు భారీగా తగ్గడమే. 2021-22లో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 48 శాతంగా ఉండగా.. 2022-23 నాటికి అది దారుణంగా 43.7 శాతానికి పడిపోయింది. కోవిడ్ మహమ్మారి సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్, టెస్టింగ్‌ల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు రాగానే అత్యవసర వ్యయాల పేరిట ప్రజా వైద్యానికి నిధులు తగ్గించేసింది. యుపిఎ2 హయంలో 64 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటా భారీగా తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక మాంద్యం, ధరల పెరుగు దల సమయంలో వైద్యం కోసం మళ్లీ సామాన్యుడే 43.4 శాతం ఖర్చు పెట్టుకోవాల్సి రావడం ప్రజలను అమాంతం అప్పులు పాలుకు గురి చేయడం ఆందోళకరం.


