కిషన్‌రెడ్డివన్నీ అబద్ధాలే..

పూర్తి ఆధారాలతో త్వరలో
పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణా అభివృద్ధికి మోడీ సర్కార్‌ పూర్తిగా సహకరించిందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆయనవన్నీ పచ్చి అబద్ధాలంటూ కొట్టిపారేశారు. అవి అబద్ధాలని నిరూపించేందుకు వీలుగా త్వరలోనే పూర్తి ఆధారాలతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఏ మేరకు నెరవేర్చిందో చెప్పాలంటూ కిషన్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏమయ్యాయని నిలదీశారు.
బీబీనగర్‌ నిమ్స్‌కు కేంద్రం నామమాత్రపు నిధులనే విడుదల చేసిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద తమ ప్రభుత్వం కొండంత నిధులను ఇస్తుంటే… ఆయుష్మాన్‌ భారత్‌ కోసం కేంద్రం గోరంత నిధులనే విదులుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పలు బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసీ రాసీ తాము అలసిపోయామని వాపోయారు. ఈ అంశాలపై ముందు సమాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రిని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.723 కోట్ల పరిహారాన్ని వెంటనే ఇవ్వాలంటూ ఫైనాన్స్‌ కమిషన్‌ చెప్పి మూడేండ్లయినా ఎందుకు ఇవ్వటం లేదన్నారు. ఏపీ ఖాతాలో పొరపాటున జమ అయిన రూ.495 కోట్లను ఇప్పటికీ ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24,205 కోట్ల సాయం చేయాలంటూ నిటి అయోగ్‌ చెప్పినా మోడీ సర్కార్‌ పట్టించుకోవటం లేదన్నారు. బోరు బావులకు విద్యుత్‌ మీటర్లను బిగించాలనే నిబంధనతో తెలంగాణా రూ.30 వేల కోట్ల మేర నష్టపోయిందని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ నిబంధనలను మార్చటం వల్ల రూ.15,033 కోట్లను నష్టపోయామని చెప్పారు. పన్నుల వాటాను కేంద్రం సక్రమంగా అమలు చేసి ఉంటే రూ.33,712 కోట్లు తెలంగాణాకు అదనంగా వచ్చేవని తెలిపారు. ఈ విధంగా అన్ని రకాలుగా కలిపి రాష్ట్రం రూ.1,35,812 కోట్లను నష్టపోయిందనీ, వీటన్నింటినీ కేంద్రం ఎందుకివ్వటం లేదనే విషయమై కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలంటూ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Spread the love