– తెలంగాణ యువన్ ఇకపై చెరగని సంతకం ఆయన..
– ఆయనది త్యాగాల పుటలతో నిండిన ఉద్యమ చరిత్ర..
– ఓడిపోయినా మొండి కత్తితో యుద్ధం నడిపించగల నాయకుడు..
నవతెలంగాణ – సిరిసిల్ల
తెలంగాణ యువనికపై చెరగని సంతకం ఆయన. త్యాగాల పుటలతో నిండిన ఉద్యమ చరిత్ర ఆయనది. మానేరు ఒడ్డున పుట్టిన ముద్దుబిడ్డ… ఆయనే కేకే మహేందర్ రెడ్డి. పదునైన కంఠంతో, పడి లేచిన కెరటంలా దూసుకొచ్చే ఆయన మాటలు నేటికీ అగ్గి రవ్వలై ఎగిసిపడుతాయి… తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలై నిలుస్తాయి. యుద్ధంలో ఒక్కసారి గెలిస్తే లక్ష్యం పూర్తయినట్టు కాదు… ఓడిపోయినంత మాత్రాన యుద్ధం ముగిసినట్టు కాదు. కానీ ఓడిపోయిన మొండి కత్తితో యుద్ధం నడిపించగల పవర్ ఫుల్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి. కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను, పుట్టిన ఊరును ప్రేమించనివాడు… దేశాన్ని ప్రేమించలేడు అది చిన్ననాడు తల్లి బోధించిన మాటలను నేటికీ గుండెల్లో పెట్టుకున్నారయన. అందుకే తాను పుట్టి పెరిగిన సిరిసిల్ల అన్నా, తెలంగాణ అన్నా, ఆయనకు చిన్ననాటి నుంచి అమితమైన ప్రేమ. పసి వయసు నుంచే సిరిసిల్ల కార్మికుల కష్టాలను చూస్తూ పెరిగారు. వారి కన్నీరు తుడిచేందుకు తన వంతు పోరాటం చేశారు. ఉపాధి లేక వలసలు పోయి చిద్రమైన అనేక కుటుంబాలకు అండగా నిలిచారు. తెలంగాణ వస్తే ఈ కష్టాలన్నీ తీరుతాయని ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని గట్టిగా నమ్మారు.
మలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుదిన వారిలో కీలకంగా నిలిచారు. ఉద్యమం కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీకి దాని సిద్ధాంతానికి జెండాకి అన్ని తానై నిలిచాడు. రాజకీయ స్వార్థంతో కాకుండా కేవలం ఉద్యమం కోసం కెసిఆర్ కు వెన్ను దన్నుగా నిలిచిన అతికొద్ది మందిలో కేకే మహేందర్ రెడ్డి కూడా ఒకరు. అయితే పార్టీ సిద్ధాంతానికి తిలోదాకాలిచ్చి కంచె చేను మేసిన చందంగా కేసీఆర్ వ్యవహరించిన తీరు ఆయనకు నచ్చలేదు. కుటుంబ రాజకీయాలు చేయనంటూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడిగినందుకు ఏకంగా ఆయనను పక్కన పెట్టేశారు కేసీఆర్. సిరిసిల్లలో తన తనయుడు కేటీఆర్ కోసం ఆయనను బలిపశువును చేశారు. అయితే నమ్మకానికి మారుపేరైన సిరిసిల్ల ప్రజలు కేకే మహేందర్ రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకున్నారు. కేటీఆర్ ను దాదాపు ఓడించినంత పని చేశారు. కేవలం 171 ఓట్లతో గెలుపు దూరమైనా మహేందర్ రెడ్డి ఏనాడు కుంగిపోలేదు. నాటి నుంచి నేటి వరకు సిరిసిల్ల ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉన్నారు. అంగబలం, అర్థబలానికి వెరవకుండా గత ప్రభుత్వ అవినీతిని, కేటీఆర్ మోసాలను ఎండగట్టాడు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకు తెలంగాణ కావాలని అడిగితే బంగారు తెలంగాణ అంటూ ఫిడెల్ వాయించిన కెసిఆర్ అహంకారం మీద తెగించి పోరాడి విజయం సాధించిన ఒకే ఒక్క వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. అందుకే ఆయన ఒక నడుస్తున్న చరిత్ర .నమ్మకానికి మారుపేరు ఇది దాచేస్తే దాగని సత్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పోరాటం చేసిన కేకే మహేందర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన పోరాటం ప్రజల కోసమేనని ప్రజలతో కలిసి ముందుకు నడుస్తూ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.