కోహ్లి, సాల్ట్‌ మెరువగా..

Virat Kohli – రాజస్థాన్‌పై బెంగళూర్‌ గెలుపు
– ఛేదనలో విరాట్‌, అజేయ అర్థ సెంచరీ
ప్రత్యర్థి సొంత గడ్డపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈడెన్‌, చెపాక్‌, వాంఖడెలో జయభేరి మోగించిన బెంగళూర్‌ తాజాగా జైపూర్‌ కోటను బద్దలు కొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫిల్‌ సాల్ట్‌ (65), విరాట్‌ కోహ్లి (62 నాటౌట్‌) అర్థ సెంచరీలతో 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 17.3 ఓవర్లలోనే ఊదేసింది. ఐపీఎల్‌18లో రాయల్స్‌కు ఇది నాల్గో ఓటమి కాగా, రాయల్‌ చాలెంజర్స్‌కు ఇది నాల్గో విజయం.
నవతెలంగాణ-జైపూర్‌
ఫిల్‌ సాల్ట్‌ (65, 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (62 నాటౌట్‌, 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ (40 నాటౌట్‌, 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం రాణించటంతో ఆదివారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్‌ 17.3 ఓవర్లలోనే ఛేదించింది. అంతకుముందు, యశస్వి జైస్వాల్‌ (75, 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఛేదనలో దంచికొట్టిన బెంగళూర్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఐపీఎల్‌18లో ఆరు మ్యాచుల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఇది నాలుగో విజయం కాగా.. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది నాలుగో పరాజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మూడో స్థానానికి ఎగబాకింది.
ఓపెనర్లు మెరువగా..
174 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఎక్కడా తడబాటుకు గురవలేదు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి తిరుగులేని ఆరంభం అందించారు. ఫిల్‌ సాల్ట్‌ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను రాజస్థాన్‌ నుంచి లాగేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 28 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సాల్ట్‌.. రాయల్స్‌ బౌలర్లతో ఆడుకున్నాడు. మరో ఎండ్‌లో విరాట్‌ కోహ్లి సాధికారిక ప్రదర్శన చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లి సీజన్‌లో సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన ఓపెనర్లు.. బెంగళూర్‌ గెలుపు లాంఛనం చేశారు. ఫిల్‌ సాల్ట్‌ నిష్క్రమించినా.. యువ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌తో కలిసి విరాట్‌ కోహ్లి ఆర్‌సీబీని గెలుపు తీరాలకు చేర్చాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన పడిక్కల్‌.. చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో కుమార్‌ కార్తికేయ (1/25) ఓ వికెట్‌ పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, మహీశ్‌ తీక్షణ, వానిందు హసరంగ, రియాన్‌ పరాగ్‌లు ప్రయత్నించినా.. వికెట్‌ వేటలో విఫలమయ్యారు.
యశస్వి జైస్వాల్‌ జోరు
టాస్‌ ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. పవర్‌ప్లేలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు ఓవర్లలో 45 పరుగులే చేసింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (75) అర్థ సెంచరీతో దంచికొట్టాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (15) పవర్‌ప్లేలో నిరాశపరిచాడు. 19 బంతుల్లో ఒక్క ఫోర్‌ కొట్టిన శాంసన్‌.. జట్టు భారీ స్కోరు ఆశలను ఆవిరి చేశాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్‌ ఆ తర్వాత వేగం పెంచే ప్రయత్నం చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రియాన్‌ పరాగ్‌ (30, 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధ్రువ్‌ జురెల్‌ (35 నాటౌట్‌, 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. లోయర్‌ ఆర్డర్‌లో షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (9) నిరాశపరిచాడు. 20 ఓవర్లలో 4 వికెట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ 173 పరుగులే చేసింది. చేతిలో వికెట్లున్నా.. ఆశించిన దూకుడు బ్యాటర్లు చూపించలేదు. బెంగళూర్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ (1/32), యశ్‌ దయాల్‌ (1/36), హాజిల్‌వుడ్‌ (1/26), కృనాల్‌ పాండ్య (1/29) రాణించారు. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు ఇటు పేస్‌, అటు స్పిన్‌పై ఎదురుదాడి చేయటంలో దారుణంగా తేలిపోయారు. ఫలితంగా సొంతగడ్డపై స్వల్ప స్కోరుకే పరిమితమైన రాజస్థాన్‌ రాయల్స్‌ సీజన్లో నాలుగో పరాజయం చవిచూసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ : 173/4 (యశస్వి జైస్వాల్‌ 75, ధ్రువ్‌ జురెల్‌ 35, రియాన్‌ పరాగ్‌ 30, కృనాల్‌ పాండ్య 1/29, భువనేశ్వర్‌ కుమార్‌ 1/32)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఇన్నింగ్స్‌ : 175/1 (ఫిల్‌ సాల్ట్‌ 65, విరాట్‌ కోహ్లి 62 నాటౌట్‌, దేవదత్‌ పడిక్కల్‌ 40 నాటౌట్‌, కుమార్‌ కార్తికేయ 1/25)

Spread the love