– సన్‌రైజర్స్‌తో కోహ్లిగ్యాంగ్ ఢీ నేడు
– రాత్రి 7:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 లీగ్ దశ చివరి వారంలోకి ప్రవేశించింది. ప్లే ఆఫ్స్‌లో రేసులో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు ఆవిరి కాగా.. మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. అందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఒకటి. చివరి రెండు మ్యాచుల్లో విజయాలతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు కోహ్లి గ్యాంగ్ సిద్ధమవుతోంది. నేడు ఉప్పల్ మైదానంలో బెంగళూర్‌కు హైదరాబాద్ షాక్ ఇస్తుందా? ప్లే ఆఫ్స్ దిశగా కోహ్లి గ్యాంగ్ ఓ అడుగు ముందుకేస్తుందా? ఆసక్తికరం.
నవతెలంగాణ-హైదరాబాద్
రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్.. బుణాత్మక నెట్ రన్‌రేట్ నుంచి బయటపడింది. మరోవైపు బెంగళూర్ కంటే ఓ స్థానం ముందున్న ముంబయి ఇండియన్స్ బుణాత్మక నెట్‌రన్‌రేట్ కలిగి ఉంది. దీంతో వరుస రెండు మ్యాచుల్లో విజయాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయం చేయనుంది. సీజన్ ఆరంభం నుంచి నిలకడలేని ప్రదర్శనలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్.. కీలక దశలో తుది జట్టులో విప్లవాత్మక మార్పులు చేసింది. విదేశీ ఆటగాళ్లను తెలివిగా ఎంచుకుంది. ఈ ఎత్తుగడ బెంగళూర్‌కు గొప్పగా పని చేస్తోంది!. అదే ఉత్సాహంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. 12 మ్యాచుల్లో ఎనిమిది పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి చేసుకుంది. ఒత్తిడి లేని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్‌కు ఉప్పల్ మైదానం ముస్తాబైంది.
ఆ నలుగురు అదుర్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఎప్పుడూ టాప్-3 ఆటగాళ్లపైనే ఆధారపడుతుంది. విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్ సహా కెప్టెన్ డుప్లెసిస్ ప్రదర్శనపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడ్డాయి. విదేశీ ఆటగాళ్ల ఎంపికలో ఆర్‌సీబీ జట్టు మేనేజ్‌మెంట్ రెండు మార్పులు చేసింది. వానిందు హసరంగ, జోశ్ హాజిల్‌వుడ్ స్థానాల్లో మైకల్ బ్రాస్‌వెల్, వేర్నీ పార్నెల్‌లు తుది జట్టులోకి వచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల రాకతోనే రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూర్ ఎదురులేని విజయం నమోదు చేసింది. బ్యాటింగ్ విభాగంలో డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ గొప్పగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లి అంచనాలను అందుకోవటం లేదు. ఉప్పల్ మైదానంలో తిరుగులేని రికార్డులు నమోదు చేసిన విరాట్ కోహ్లి.. నేడు ఇక్కడ స్పెషల్ ఇన్నింగ్స్‌తో అలరిస్తాడేమో చూడాలి. ఒత్తిడిలో మరింత దూకుడుగా రాణించే కోహ్లి.. ప్లే ఆఫ్స్ అవకాశాల ముంగిట బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడనే ఆర్‌సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. లోకల్ హీరో మహ్మద్ సిరాజ్ బెంగళూర్ బౌలింగ్‌కు నాయకత్వం వహించనున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు కీలక ఆటగాడిగా ఎదిగిన మహ్మద్ సిరాజ్ సొంతగడ్డపై చెలరేగేందుకు ఎదురు చూస్తున్నాడు.
ఊరట లభించేనా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. ఆటగాళ్ల వేలంలో నాణ్యమైన క్రికెటర్లను సొంతం చేసుకున్నప్పటికీ.. మైదానంలో ప్రదర్శన ఏమాత్రం మారలేదు. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన క్రికెటర్లు కోటికో పరుగు చేయటంలోనూ విఫలమయ్యారు. విదేశీ ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌లు మాత్రమే నిలకడగా రాణించారు. కెప్టెన్ ఎడెన్ మార్క్‌రామ్ అటు నాయకత్వంలో, ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. హ్యారీ బ్రూక్ కోల్‌కతపై శతకంతో మురిపించినా.. ఆ తర్వాత మళ్లీ వైఫల్య బాట పట్టాడు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ నిలకడగా నిరాశపరిచారు. సులువుగా నెగ్గాల్సిన మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని కౌగిలించుకుని ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. ఈ సీజన్లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి.. పాయింట్ట పట్టికలో కాస్త పైకి ఎగబాకుతుందేమో చూడాలి.
కోహ్లి కోసం అభిమానులు! :
విరాట్ కోహ్లి కోసం హైదరాబాద్ అభిమానులు ఉప్పల్ స్టేడియానికి పోటెత్తనున్నారు. లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఇటీవల విరాట్ కోహ్లితో ఘర్షణ దిగగా.. హైదరాబాద్‌కు వచ్చిన గంభీర్‌పై కోహ్లి అభిమానులు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ సీజన్లో ఎం.ఎస్ ధోని హైదరాబాద్‌కు రాలేదు. దీంతో విరాట్ కోహ్లి కోసం అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. భావోద్వేగంతో ఉన్న ఆర్‌సీబీ అభిమానులు నేడు ఉప్పల్‌లో విరాట్ కోహ్లి స్పెషల్‌ను ఆశిస్తున్నారు. కోహ్లి రాకతో నేడు ఉప్పల్ స్టేడియం హౌస్‌ఫుల్ కానుంది. హైదరాబాద్, బెంగళూర్ మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో అర్థగంటలోనే అమ్ముడు కాగా.. బ్లాక్ మార్కెట్‌లో నాలుగైదు రెట్లు అధిక రేట్లకు టికెట్లను సొంతం చేసుకునేందుకు సైతం అభిమానులు వెనుకాడటం లేదు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై సన్‌రైజర్స్‌కు గొప్ప రికార్డుంది. ఇక్కడ బెంగళూర్‌పై సన్‌రైజర్స్ ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. అందులో ఓ సూపర్ ఓవర్ విక్టరీ సైతం ఉంది. 2015 ఐపీఎల్‌లో వర్షం ప్రభావిత మ్యాచ్‌లో బెంగళూర్ విజయం సాధించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచుల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 172. ఆరు మ్యాచుల్లో నాలుగింట తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది.