కూనను కుమ్మేశారు

కూనను కుమ్మేశారు– ఐర్లాండ్‌ 96 పరుగులకే ఆలౌట్‌
– అర్షదీప్‌, హార్దిక్‌, బుమ్రా విజృంభణ
– ఛేదనలో రోహిత్‌, పంత్‌ దూకుడు
– ఐర్లాండ్‌ 96/10, భారత్‌ 97/2
భారత పేసర్లు పంజా విసిరారు. అర్షదీప్‌ సింగ్‌ (2/35), జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/6), హార్దిక్‌ పాండ్య (3/27) వికెట్ల వేటలో విజృంభించారు. పేస్‌ త్రయం నిప్పులు చెరగటంతో పసికూన ఐర్లాండ్‌ విలవిల్లాడింది. 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52) అర్థ సెంచరీతో చెలరేగాడు. రిషబ్‌ పంత్‌ (36 నాటౌట్‌) తోడుగా భారత్‌కు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
నవతెలంగాణ-న్యూయార్క్‌
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52, 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషబ్‌ పంత్‌ (36 నాటౌట్‌, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కదం తొక్కారు. మరో 46 బంతులు మిగిలి ఉండగానే 12.2 ఓవర్లలోనే భారత్‌ లాంఛనం ముగించింది. అంతకుముందు, అర్షదీప్‌ సింగ్‌ (2/35), జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/6), హార్దిక్‌ పాండ్య (3/27) కలిసికట్టుగా విజృంభించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-ఏ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పేసర్లు నిప్పులు చెరిగారు. నాణ్యమైన పేసర్ల మెరుపులతో ఐర్లాండ్‌ 96 పరుగులకే కుప్పకూలింది. టెయిలెండర్‌ గారెత్‌ డెలానీ (26, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐర్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. ఐర్లాండ్‌పై విజయంతో గ్రూప్‌-ఏలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది.
రోహిత్‌ మెరువగా.. : ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52) చెలరేగాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (1) నిరాశపరిచినా.. రిషబ్‌ పంత్‌ (00)తో కలిసి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. పవర్‌ప్లేలో పరుగుల వేట కష్టమైన వేళ కోహ్లితో కలిసి 22 పరుగుల భాగస్వామ్మం నిర్మించిన రోహిత్‌.. పంత్‌తో కలిసి రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జత చేశాడు. పంత్‌, రోహిత్‌ మెరుపులతో భారత్‌ గెలుపు ఖాయం చేసుకుంది. మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 36 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ.. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (2) సైతం నిరాశపరిచాడు. శివం దూబె (0 నాటౌట్‌)తో కలిసి రిషబ్‌ పంత్‌ లాంఛనం ముగించాడు. 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్‌ 97 పరుగులు చేసింది.
చెలరేగిన పేసర్లు : టాస్‌ నెగ్గిన టీమ్‌ ఇండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. న్యూయార్క్‌ స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై బ్యాటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌ శర్మ ఛేదనకు మొగ్గు చూపాడు. పసికూన ఐర్లాండ్‌పై అర్షదీప్‌ సింగ్‌ పవర్‌ప్లేలోనే పంజా విసిరాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్‌ చేశాడు. పాల్‌ స్టిర్టింగ్‌ (2), ఆండీ బల్‌బిర్నె (5, 10 బంతుల్లో 1 ఫోర్‌)లను ఓవర్‌ తొలి, చివరి బంతికి సాగనంపాడు. అర్షదీప్‌ దెబ్బకు పవర్‌ప్లేలో 2 వికెట్లకు ఐర్లాండ్‌ 26 పరుగులే చేసింది. మిడిల్‌ ఓవర్లలో వికెట్ల వేటను బుమ్రా, హార్దిక్‌ పాండ్య కొనసాగించారు. లోర్కన్‌ టక్కర్‌ (10)ను హార్దిక్‌ పాండ్య క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. హ్యారీ టెక్టర్‌ (4)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. కర్టీస్‌ కాంపెర్‌ (12) సైతం హార్దిక్‌ పాండ్యకు తలొంచాడు. 44 పరుగులే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. భారత బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకు ఆలౌటయ్యే ప్రమాదంలో పడిన ఐర్లాండ్‌ను గెరాత్‌ డెలానీ (26) ఆదుకున్నాడు. రెండు ఫోర్లు, సిక్సర్లతో మెరిసిన డెలానీ.. ఐర్లాండ్‌ను వంద పరుగుల మార్క్‌ దిశగా నడిపించాడు. జార్జ్‌ డాక్‌రెల్‌ (3), మార్క్‌ ఎడెర్‌ (3), మెక్‌కార్టీ (0) విఫలమవగా.. జోశ్‌ లిటిల్‌ (14) చివర్లో మెప్పించాడు. బెన్‌ వైట్‌ (2 నాటౌట్‌) అజేయంగా మిగిలాడు. ఐర్లాండ్‌ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది.

Spread the love