పారిశుధ్య కార్మికులతో కేటీఆర్‌ వేడుకలు

KTR celebrations with sanitation workers– వారితో కలిసి భోజనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నూతన సంవత్సర వేడుకలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు పారిశుధ్య కార్మికులతో కలిసి చేసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వారితో కలిసి కేటీఆర్‌ భోజనం చేశారు. కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శానిటరీ కార్మికులకు మూడుసార్లు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత కీలకమైన పారిశుధ్య కార్మికులకు తాము ప్రాధాన్యత ఇచ్చామని, వారికి గౌరవం పెంచెలా జీతాలు పెంచామని అన్నారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామనీ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యలను చెబితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ మేయర్‌ విజయలక్ష్మితో సమన్వయం చేసుకోవాలన్నారు. జీతాల పెంపుతోపాటు, అరోగ్య, ఉద్యోగ భద్రత అంశాలను కేటీఆర్‌ దృష్టికి పారిశుధ్య కార్మికులు తీసుకొచ్చారు. ఇతర అవుట్‌ సొర్సింగ్‌ కార్మికుల మాదిరే తమకు కూడా ఇతర సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వంపైన ఒత్తిడి  తీసుకురావాలని కోరారు.
కేటీఆర్‌ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్‌ చైర్మెన్లు రాజీవ్‌ సాగర్‌, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, నగేశ్‌, పలువరు విద్యార్ధి నాయకులు, పార్టీశ్రేణులున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలను కేటీఆర్‌ కలిశారు.

Spread the love