అవును నిజమే….
రెండు రెళ్లు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే రాజ్యమిది
ఏ రాజకీయానికి అమ్ముడుపోక ప్రజలపక్షాన
నిలిచిన కునాల్ కమ్రా జరిగే నిజాలను
హాస్య చతురతతో వ్యంగాస్త్రాలుగా విసిరి
జనాలను సుతిమెత్తగా నవ్విస్తూ
నిలదీస్తూ చేసే విదూషక ప్రదర్శనకే జడిసి
నీతిమాలిన రాజకీయులకు
మింగుడుపడక శివాలెత్తి వీరంగాలేస్తూ
కిరాయి గూండాలు
మతం మత్తెక్కిన ఆంబోతులతో
సష్టించిన దాడి విధ్వంసం
నేటి బూటకపు మేడిపండు
ప్రజాస్వామ్య లుకలుకల ఆనవాళ్లు
మాయ మాటలతో ప్రజల్ని మభ్యపెట్టి
అధికార అందలం ఎక్కీఎక్కక ముందే
ప్రతీకార కక్షారాజకీయం అమలు చేస్తూ
ఇదన్యాయం అవినీతని నిలదీసే
గొంతుకలను నులిమేస్తూ
ప్రజల పక్షాన ప్రశ్నిస్తే, కలాన్ని కదిలిస్తే
అక్రమ కుట్రకేసులతో
అండా సెల్‌లో లేదంటే
అంతుచిక్కని రిమాండ్‌ల పేరిట
జైళ్లు నోళ్ళు తెరిచే భూమి మనది !
చరిత్రలో చార్వాకుడు మొదలు
నిన్నటి గౌరీ లంకేశ్ కల్బురి
దబోల్కర్ లెందరో ఈ దుర్మార్గపు
దమనకాండకు బలైన అమర క్రీస్తులే!
ప్రశ్నించటం మనిషి సహజగుణం
ప్రశ్నతోనే ఆదిమ మానవుడు
ప్రకతిని ఒడిసిపట్టి గడించిన
విజ్ఞానంతో నాగరీకుడయ్యాడు
ప్రశ్న లేకుంటే మనిషికి మనుగడే లేదు
ప్రశ్న ఒక తిరుగులేని బీజాక్షరం
అణచాలనిచూస్తే తిరిగి కొత్త శక్తులతో
తలెత్తి మొలకెత్తే అగ్ని శిఖలా
ప్రజ్వరిల్లుతుంది జాగ్రత్త !
( కునాల్ కమ్రాపై గూండాల దాడికి నిరసనగా)
– డా. కె. దివాకరాచారి, 9391018972