లక్ష్మీనరసింహస్వామి భూములు హాంఫట్‌..

Lands of Lakshminarasimhaswamy Hamphat..– అధికారుల నిర్లక్ష్యం… భూబకాసురుల బరితెగింపు
– కమిషనర్‌ ఉత్తర్వులు పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు
నవతెలంగాణ-ముదిగొండ
లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూములు ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణగా కబ్జాలకు గురవుతున్నాయి. దేవాలయ భూములు కబ్జా చేసేందుకు సుమారు ఆరు నెలల నుండి భూ అక్రమదారులు ప్లాన్‌ చేస్తున్నారు. సువర్ణాపురం రెవిన్యూ పరిధిలో 308, 309, 310 సర్వే నెంబర్లలో 33 ఎకరాల 26 కుంటలు లక్ష్మీనరసింహ, చెన్నకేశవస్వామి దేవాలయాల భూములు ముదిగొండ సమీపాన ఉన్నాయి. ఈ భూముల్లో నుండి జాతీయ రహదారి (బైపాస్‌) ఖమ్మం వరకు వెళుతుంది. ముదిగొండకు చెందిన కొందరు భూఅక్రమదారులు గతంలో దేవాలయ భూమి నాలుగు ఎకరాలు కబ్జా చేసి జాతీయ రహదారి నిర్మాణం చేసే కాంట్రాక్టర్లకు విక్రయించుకొని భారీగా దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను రక్షించుకొనుటకు దేవాలయ భక్తులు, పూజారులు జిల్లా ఉన్నతాధికారులుతోపాటు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వినతిపత్రాలు ఇచ్చిన తూతూ మంత్రంగా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన భూఅక్రమదారులు భూముల్లో దేవదాయ శాఖ హద్దులు గుర్తించి బోర్డులు ఏర్పాటు చేసినా ఆ బోర్డులను మాయం చేసి చెరువులో వేసి హద్దులు తొలగించారు. దేవాలయ భూదందాపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భూబకాసురులు బరితెగించారు. దేవాలయ భూములన్ని దేవాదాయ శాఖ స్వాధీనంలో ఉండే విధంగా హైదరాబాద్‌ దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి దేవాదాయ భూములు రక్షించాలని ఉత్తరాలు జారీచేసినా ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారి నిర్మాణానికి భూబకాసురులు విక్రయించిన నాలుగు ఎకరాల దేవాలయ భూముల లక్ష్మీనరసింహస్వామికే చెందే విధంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ రికవరీ యాక్టు పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఖమ్మం జిల్లా దేవదాయ శాఖ అధికారులకు, ఈవో నారాయణ నారాయణచార్యులకు దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే విధంగా హైదరాబాద్‌ దేవాదాయ శాఖ కమిషనర్‌ నుండి లక్ష్మినరసింహ, చెన్నకేశవస్వామి భూములను కాపాడాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ ఆదేశాలు అందిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. భూబకాసురులు మాత్రం ఈభూములను ఎలా అన్యక్రాంతం చేయాలని కుట్రలతో ఆలోచనలు అధికారులకు వల విసురుతున్నారు. ఏకంగా లక్ష్మీనరసింహ చెన్నకేశవస్వామిలకు శఠగోపం పెట్టేందుకు భూమాఫియా గ్యాంగ్‌ కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా పట్టించుకోకపోతే దేవాలయ భూములు భూబకాసురుల స్వాధీనంలోకి వెళ్లిపోవడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love