Sunday, July 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలపై లేజర్ దాడులు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలపై లేజర్ దాడులు!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసరాల్లో విమానాల భద్రతకు సరికొత్త ముప్పు పొంచి ఉంది. విమానాలు టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ కోసం వస్తున్నప్పుడు వాటిపైకి శక్తివంతమైన లేజర్ కిరణాలను ప్రయోగించే ఘటనలు నగరంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో ఇలాంటివి 100కు పైగా కేసులు నమోదు కావడం ఏవియేషన్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

దాదాపు రెండు వారాల క్రితం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరం నుండి హైదరాబాద్ వచ్చిన లూఫ్తాన్సా విమానానికి ల్యాండింగ్ సమయంలో ఒక ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. రన్‌వేపైకి వస్తున్న క్రమంలో విమానం కాక్‌పిట్‌పైకి ఒక్కసారిగా లేజర్ కాంతి దూసుకొచ్చింది. అత్యంత కీలకమైన ల్యాండింగ్ సమయంలో లేజర్ వెలుతురు వల్ల పైలట్ల కంటి చూపునకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది. పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 43 విమానాశ్రయాలలో 1,000కు పైగా ఇలాంటి లేజర్ ఘటనలు నమోదు కాగా.. అందులో 10 శాతం కేవలం హైదరాబాద్‌లోనే జరిగాయి. ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఈ తరహా కేసులు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా తర్వాత హైదరాబాద్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. “కేవలం కొన్ని సెకన్ల పాటు లేజర్ కాంతి పైలట్ల కళ్లపై పడినా వారు తాత్కాలికంగా గుడ్డివారవుతారు. ఇది విమాన భద్రతకు తీవ్ర ముప్పు” అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ప్రెసిడెంట్ కెప్టెన్ సి.ఎస్.రంధావా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఫాంహౌస్‌లు, ఫంక్షన్ హాళ్లు, పెళ్లి వేడుకల్లో వాడే డీజే లైట్లు, హై-పవర్ లేజర్ బీమ్స్ విమానాల మార్గానికి అడ్డుగా వస్తున్నట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోని నాలుగు ఫాంహౌస్‌లు, రెండు వెడ్డింగ్ హాళ్ల యజమానులకు పోలీసులు ఇప్పటికే తీవ్ర హెచ్చరికలతో కూడిన నోటీసులు జారీ చేశారు. విమానాల భద్రతకు భంగం కలిగించేలా లేజర్ లైట్లు వాడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -