చివరిరోజు హోరెత్తిన ప్రచారం

చివరిరోజు హోరెత్తిన ప్రచారం– అందుబాటులో ఉండని, పార్టీలు మారే అభ్యర్థులను ఓడించండి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌
– మధిరలో పాలడుగు గెలుపు కోరుతూ ర్యాలీ
–  ఖమ్మం, తల్లాడలో బైక్‌ ర్యాలీ
నవతెలంగాణ – బోనకల్‌/ ఖమ్మం/ తల్లాడ/
15 ఏండ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఏనాడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండని మల్లు భట్టి విక్రమార్కను, తరచూ పార్టీలు మార్చే లింగాల కమల్‌రాజును ఓడించి ప్రజల కోసమే పని చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ను గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మధిర నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించారు. బోనకల్‌ మండలం ముష్టికుంట గ్రామంలో సోమవారం రాత్రి సీపీఐ(ఎం)అభ్యర్థి భాస్కర్‌ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్దతు పలుకుతున్నారని, లింగాల కమల్‌ రాజు గెలిచినా ఒకటే బిజెపి అభ్యర్థి గెలిచిన ఒకటే అన్నారు. బిజెపి, బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నికరంగా పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ను శాసనసభలోకి పంపాల్సిన బాధ్యత మధిర నియోజకవర్గ ఓటర్లందరిపై ఉందన్నారు. మధిర నియోజకవర్గ ప్రజల, నియోజకవర్గ అభివృద్ధి గురించి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడిన పాపాన పోలేదన్నారు. సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు మాట్లాడుతూ మధిర నియోజకవర్గ అభివృద్ధి బోడేపూడి మరణంతో నిలిచిపోయిందన్నారు. పదవుల కోసం పాకులాడే, డబ్బు సంచులతో వస్తున్న మల్లు భట్టి విక్రమార్కను, లింగాల కమల్‌ రాజును ఈ ఎన్నికలలో ఓడించకపోతే నియోజకవర్గ అభివృద్ధి జరగదు అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, నాయకులు బంధం శ్రీనివాసరావు, కందికొండ శ్రీనివాసరావు, కొంగర వెంకటనారాయణ, దొప్ప కొరివి వీరభద్రం, బోయినపల్లి కోటేశ్వరరావు, షేక్‌ నజీర్‌, మాజీ సర్పంచులు కొమ్ము శంకర్‌, బంధం వెంకటరాజ్యం, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఖమ్మంలో శ్రీకాంత్‌కి ఓటేసి గెలిపించాలి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని పిలుపు
ఖమ్మంలో నీతి నిజాయితీగా పరిపాలించిన ఘనత సీపీఐ(ఎం)దేనని, నిజాయితీగల సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌కి ప్రజలు స్వేచ్ఛందంగా ఓటేసి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. యర్రా శ్రీకాంత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో పార్టీ అధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌ సుందరయ్య భవన్‌ నుంచి పాత బస్టాండ్‌, జెడ్పీ సెంటర్‌, ఇల్లందు క్రాస్‌ రోడ్‌ మీదుగా గట్టయ్య సెంటర్‌ తిరిగి సుందరయ్య భవన్‌ వరకు ర్యాలీ సాగింది.
సత్తుపల్లిలో మాచర్ల భారతిని గెలిపించాలి : సాయిబాబు
అర్ధబలం, అంగ బలం, మంది మార్బలం, డబ్బున్న పార్టీలు ఒకవైపు, దేశం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడే ఎర్రజెండా ఒకవైపున ఉన్నాయని, ఈ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు కోరారు. సత్తుపల్లి నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోతే నష్టపోయేది ప్రజలేనని సూచించారు.. అభ్యర్థి మాచర్ల భారతి మాట్లాడుతూ..తనను గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడి పరిష్కారం చేస్తానని అన్నారు.

Spread the love