Thursday, May 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలే ఆఫ్‌లు బాధించే విషయమే: మెటా సీఈఓ

లే ఆఫ్‌లు బాధించే విషయమే: మెటా సీఈఓ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీద ఆధారపడుతోంది. కృత్రిమ మేధ (AI) ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో …. టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. అనేక టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ టెక్ దిగ్గజం ఫేస్‌ బుక్ మాతృసంస్థ మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై దృష్టి సారించి ఏకంగా 10 శాతం (దాదాపు 8,000 మంది) ఉద్యోగులను తొలగించింది. 2022-23లో సుమారు 21,000 మందిని తొలగించిన తర్వాత ఇది అతిపెద్ద లే ఆఫ్ గా చెప్పొచ్చు.

తొలగించబడిన ఉద్యోగులకు మెటా భారీ ప్యాకేజి ….
ఐరోపా, అమెరికా, సింగపూర్‌లలో కొందరు ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’ చేసే అవకాశం కల్పించి.. అంతలోనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ‘ఇ-మెయిల్‌’ ద్వారా సమాచారాన్ని మెటా (Meta) పంపింది. అయితే, తాజా లేఆఫ్‌ల తర్వాత ఈ ఏడాది కంపెనీలో ఎలాంటి కోతలు ఉండబోవని భావిస్తున్నట్లు సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. తొలగించబడిన ఉద్యోగులకు మెటా భారీ ప్యాకేజీని ప్రకటించింది. అయితే మెటా ఈ ఏడాది చివర్లోనూ మరిన్ని తొలగింపులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

మెటా అందించే ప్యాకేజీ వివరాలు ….
జీతం (Severance Pay): కనీసం 16 వారాల (నాలుగు నెలలు) బేసిక్ వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి ఏడాదకు అదనంగా మరో 2 వారాల జీతాన్ని పరిహారంగా ఇస్తారు.
ఆరోగ్య బీమా (Healthcare): ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచితంగా హెల్త్‌కేర్ కవరేజ్ అందుతుంది.
ఇతర ప్రయోజనాలు : ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ పేయిడ్ టైమ్ ఆఫ్ (PTO) నగదు, కంపెనీ స్టాక్ గ్రాంట్లు, అలాగే మూడు నెలల పాటు ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి కావలసిన సాయం (Job-Search assistance) కూడా అందజేయబడుతుంది.
ఈ నిర్ణయంతో పాటు, మెటా దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ (AI) ప్రాజెక్టులకు బదిలీ చేస్తోంది. అయితే, అమెరికాలోని హెచ్‌-1బి (H-1B) వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ గైడెన్స్ కూడా మెటా కల్పిస్తోంది.

బాధించే విషయమే : మెటా సిఇఒ
ఈ ఏడాది మరిన్ని లేఆఫ్‌లు ఉండకపోవచ్చని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో సిఇఒ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) వెల్లడించారు. ‘‘విజయం దానంతట అది వచ్చేది కాదు. ఎఐ మన జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపించే సాంకేతికత. ఆ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే సంస్థలే తర్వాత తరానికి ఒక మార్గం చూపిస్తాయి. ఈ కంపెనీ అభివృద్ధిలో భాగమైన వారికి గుడ్‌బై చెప్పడం ఎప్పుడూ బాధించే విషయమే. అది నేను అనుభవిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఏడాది చివర్లోనూ తొలగింపుల ప్రణాళిక ….
మెటా ఈ ఏడాది చివర్లోనూ మరిన్ని తొలగింపులకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనితో పాటు, బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ ఛార్టెర్డ్ పీఎల్‌సీ బ్యాంక్ కూడా 2030 నాటికి 15 శాతం దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఎఐ ఏజెంట్లను వినియోగించనున్నట్లు ప్రకటించింది.

ఉద్యోగులకు షాకింగ్ మెమో ….
”ఎఐ విధివిధానాలకు అనుగుణంగా చాలా సంస్థలు పునర్ ‌వ్యవస్థీకరణ చర్యలు చేపట్టాయి. మనం కూడా (మెటా) ఆ మార్పులను అమలుచేయాల్సిన దశలో ఉన్నాం. ఇందులో భాగంగానే 10 శాతం ఉద్యోగులకు లేఆఫ్‌లు విధించాలని నిర్ణయించాం. మేనేజర్‌ స్థాయి విధుల్లో ఉన్నవారిని పూర్తిగా పక్కనబెడతాం.” అంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు.

ఎఐ సంబంధిత కొత్త ప్రాజెక్టుల్లోకి ఏడు వేల మంది
దాదాపు 7 వేల మంది ఉద్యోగులను ఎఐ సంబంధిత కొత్త ప్రాజెక్టుల్లోకి మార్చనున్నాం. ఇప్పటికే కొంతమంది ట్రాన్స్‌ఫర్లు పూర్తయ్యాయి. మిగిలిన వారికి మే 20 నుంచి అప్‌డేట్లు వస్తాయి. ఇక, ఈ పునర్ ‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా 6 వేల కొత్త రోల్స్‌ను తీసుకురానున్నాం. అని మెటా సిఇఒ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -