సారథ్యానికి సెలవు

సారథ్యానికి సెలవు– కెప్టెన్సీ వదిలేసిన ఎం.ఎస్‌ ధోని
– సూపర్‌కింగ్స్‌ కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌
చెన్నై : ‘ ఈ సీజన్‌లో కొత్త పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’… ఐపీఎల్‌ ఆరంభానికి ఓ పది రోజుల ముంగిట మహేంద్ర సింగ్‌ ధోని సోషల్‌ మీడియా పోస్ట్‌ ఇది. అభిమానుల కోసం మరో సీజన్‌ ఆడేందుకు మోకాలి గాయానికి శస్త్రచికత్స సైతం చేయించుకున్న మహి.. ఐపీఎల్‌ 17లో కచ్చితంగా ఆడుతాడని తెలుసు. అయినా, సూపర్‌కింగ్స్‌ శిబిరంలో ఇంకా సరికొత్త బాధ్యత ఏమైఉంటందని అభిమానుల్లో విపరీత చర్చ నడిచింది. ఈ సస్పెన్స్‌కు సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం గురువారం తెరదించింది. ఎం.ఎస్‌ ధోని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలిపింది. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ కొత్త కెప్టెన్‌ అని ప్రకటించింది. 42 ఏండ్ల ధోని.. ఐపీఎల్‌ 16లోనూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించగా.. అతడు ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. దీంతో సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ వదిలేసి ప్రాంఛైజీ నుంచి వెళ్లిపోయాడు. ఐపీఎల్‌17 ముంగిట మళ్లీ ధోని కెప్టెన్సీ వదులుకోగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌కు నాయకత్వ పగ్గాలు దక్కాయి. ఎం.ఎస్‌ ధోని సూపర్‌కింగ్స్‌ను 212 ఐపీఎల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌గా నడిపించగా.. 128 విజయాలు సాధించి, 82 పరాజయాలు చవిచూశాడు.

Spread the love