Friday, August 7, 2026
E-PAPER
Homeఖమ్మంక్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో'ను జయప్రదం చేద్దాం

క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో’ను జయప్రదం చేద్దాం

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి
– పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ కమిటీ సమావేశం
నవతెలంగాణ – ​సత్తుపల్లి

క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ (CITU), వ్యకాస, రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ‘జైలు భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవన్‌లో చలమాల విఠల్ అధ్యక్షతన సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శివర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాచర్ల భారతి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధమైన హక్కుగా కాకుండా, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పథకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు.

కార్మికుల రక్షణ కోసం ఉన్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా విభజించి, వారి హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్రం పూర్తిస్థాయిలో విఫలమైందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చే విధానాలను అవలంబిస్తోందని అన్నారు. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు, రైతాంగానికి నష్టం కలిగించేలా ఉండకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, సంక్షేమ పథకాలకు నిధుల కోత,  ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ ‘జైలు భరో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకాకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్, రామమందిరం పేరుతో నిధుల దుర్వినియోగం, మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రధాని, హోంమంత్రులు పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని భారతి డిమాండ్ చేశారు.

​ఆగస్టు 10న జరిగే ‘జైలు భరో’ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, మేధావులు పెద్దెత్తున మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు, మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, అయినాల రామలింగేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జునరావు, అరవపల్లి జగన్మోహనరావు, జాజిరి జ్యోతి, రావుల రాజబాబు, మల్లూరు  చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -