మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలనీ, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని సీఎం కోరారు. ‘ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి ఉంది. మొదటి ప్రతిపాదనలో ఈ బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్నాం. 2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అవసరమైన అనుమతులకు సహకారం అందిస్తామని కూడా అప్పట్లో తెలిపింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పున: సమీక్షించింది. 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణుల సూచనలతో అంచనాకు వచ్చింది. అందుకే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజీ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని తెలంగాణ భావిస్తోంది. కావున ఈ అంశంపై రెండు రాష్ట్రాలు చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు సమావేశం ఏర్పాటుకు సమయం ఇవ్వండి’ అని రేవంత్‌రెడ్డి లేఖలో కోరారు.
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై చర్చిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



