Thursday, May 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచావనైనా చస్తాం భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోం

చావనైనా చస్తాం భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోం

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చావనైనా చస్తాం.. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోబోమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్విరాజ్ అధ్యక్షతన ఇనుపబూట్లు ఇంకెంతకాలం? అని ప్రశ్నిస్తూ హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగేశ్వర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హరించడం సరికాదన్నారు. తాను భయపడే ప్రసక్తే లేదనీ, ఇప్పటి వరకు యాంటీసిపేటరీ బెయిల్ కోసం వెళ్లలేదనీ, వెళ్లబోనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తన ఇంటికి అరెస్ట్ చేసేందుకు ఎవరు రాలేదని తెలిపారు. తన మాటల్లో కులం, ప్రాంతం ప్రస్తావన లేకుండా తాను కులచిచ్చు పెట్టడానికి ప్రయత్నించానని ఆరోపించారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్లోనే కులం, ప్రాంతం ప్రస్తావన తెచ్చారని తెలిపారు. ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశానని ఆరోపణలు తనపై మోపారనీ, పదాలకు, ప్రకటనలకు వర్తించని సెక్షన్లు పెట్టి నవ్వు తెప్పించేలా కేసు నమోదు చేశారని తీసిపారేశారు. తాను ఆంధ్రప్రదేశ్ గురించే కాదు…. ప్రపంచంలోని అనేక దేశాలు, ప్రాంతాల గురించి మాట్లాడుతున్నానని గుర్తుచేశారు. ఆదాయం వచ్చే రైల్వే లైన్ తీసేసి విశాఖ పట్నం రైల్వే జోన్ ఇస్తే, పామర్రులో ఒఎన్జీసీ విలువైన ఆయిల్ నిక్షేపాలను కనుగొంటే దుర్మార్గ చరిత్ర కలిగిన వేదాంతకు అప్పగిస్తే ఏపీలో ఏ ఒక్క పార్టీ అడగలేదని తప్పుపట్టారు. ఇలాంటి వంద ఉదాహరణలు తాను చెప్పగలనని అన్నారు. తనను అరెస్ట్ చేస్తారో లేక కేసులు ఉపసంహరించుకుంటారో? చేయరో? వారి ఇష్టమని తెలిపారు. దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎంత బెదిరిస్తే అంత ఎక్కువగా మాట్లాడుతామని హెచ్చరించారు. అరెస్ట్ చేసేందుకు వస్తామంటే ఎప్పుడొస్తారో చెప్పాలని సవాల్ విసిరారు.

ఆంధ్రా పెత్తందారీతనంపై పోరాటం కొనసాగిస్తాం
తెలంగాణలో ఆంధ్రా పెత్తందారీతనంపై తమ పోరాటం కొనసాగుతుందని పృథ్విరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ మేధావులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండు కండ్ల సిద్ధాంతాలను, ధృతరాష్ట్ర కౌగిలిలను నమ్మే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులకు శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో ఏం పని ఉంటుంది? అని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు ఎన్నుకున్నది సేవ చేయడానికని గుర్తుచేశారు. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పై టీడీపీ, జన సేన దుష్ప్రచారాన్ని ఆపాలనీ, హెరిటేజ్ ఉత్పత్తులను బహిష్కరించాలనీ, సోర్స్ ను అడగొద్దనీ, టీడీపీ హ్యాండిల్ లో నాగేశ్వర్ పై పెట్టిన పోస్ట్ ను వెనక్కి తీసుకోవాలనీ, ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలనీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సంస్థలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో సంధ్య (పీఓడబ్ల్యూ), సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ తులసి చందు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కంభాలపల్లి కృష్ణ, జర్నలిస్టులు కాళోజీ శ్రీను, మన తొలివెలుగు రఘు తదితరులు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -