కాషాయపార్టీని కలవరపెడుతున్న సీజేపీ
దేశంలో ఉద్యోగాల కొరత, పేపర్ లీకులు,
పెట్రో, నిత్యవసర ధరల పెరుగుదల
మోడీ సర్కారుపై యువతలో తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ : భారతీయ రాజకీయ వర్గాల్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. సోషల్ మీడియాలో వైరలైన సీజేపీ అనే వ్యంగ్య ఉద్యమం యువత అసంతృప్తికి అద్దం పడుతున్న ది. మోడీ పాలనలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, పేపర్ లీకులు తీవ్ర ఆందోళనలకు దారి తీశాయి. ఇక దేశంలో పెట్రో ధరల మంట, ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇటు సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశ యువత, ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్ర అసంతృప్తే సీజేపీగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సీజేపీ భయం పట్టుకున్నదని వారు అంటున్నారు.
సంప్రదాయ రాజకీయాలపై యువత అసంతృప్తి
భారత రాజకీయాల్లో అధికార పక్షం కథన నియంత్రణ (న్యారేటీవ్ కంట్రోల్)పై ఎంతగా ఆధారపడిందో కాక్రోచ్ పార్టీపై కాషాయపార్టీ వ్యవహరిస్తున్న తీరే బయటపెట్టింది. సాధారణంగా ఒక ఆన్‌లైన్ మీమ్, వ్యంగ్య ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని ప్రభుత్వాలు.. దీనిపై తీవ్రంగా స్పందించడం వెనుక భయం దాగి ఉందని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగం, పేపర్ లీకులు, వ్యవస్థలో అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై యువతలో పెరుగుతున్న అసహనం ఈ ఉద్యమానికి బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘కాక్రోచ్ జనతా పార్టీకి ఎలాంటి రాజకీయ నిర్మాణమూ లేదు. నాయకుడూ లేడు. కార్యాలయమూ లేదు. అయినా అది సోషల్ మీడియాలో భారీ మద్దతు సంపాదించింది. దీనికి కారణం.. సంప్రదాయ రాజకీయాలపై యువతలో పెరిగిన విసుగు’’ అని ఆయన వివరించారు.
విదేశీ కుట్రగా చిత్రీకరించేందకు బీజేపీ యత్నం
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, దాని అనుబంధ, అనుకూల వర్గాలు కొత్త ప్రచారానికి తెరదీశాయి. ‘కాక్రోచ్’ ఉద్యమాన్ని విదేశీ కుట్రగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. కొందరు దీనిని (సీజేపీ) పాక్ , మరికొందరు ఆప్‌నకు ఆపాదించారని రాజ్‌దీప్ వివరించారు. అధికార పార్టీ అలాంటి ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ.. దేశంలో ఎదుర్కొంటున్న అసలు సమస్యలను దాచలేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం.. యువత కోపం. భారత్‌లో అధిక సంఖ్యలో చదువుకున్న యువకులు ఉద్యోగ అవకాశాల కొరత, పెరుగుతున్న పోటీ, ఆర్థిక అస్థిరతతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకునే మోడీ సర్కారుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్తున్నారు.
ప్రతిపక్షాలు.. బలమైన రాజకీయ ఉద్యమంగా మార్చాలి
ఇక దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అధికార ఎన్డీఏపై మరింత బలంగా పోరాడాల్సిన అవసరాన్ని రాజకీయ విశ్లేషకులు నొక్కి చెప్తున్నారు. దేశంలో యువత అసంతృప్తిని కేవలం మీమ్స్‌లా కాకుండా… ఒక బలమైన రాజకీయ ఉద్యమంగా మలచగల సామర్థ్యం ప్రతిపక్షాలలో ఇంకా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మరింతగా తమ పోరాటాలను ఉధృతం చేయాలని సూచిస్తున్నారు.
హామీలను నెరవేర్చని బీజేపీ.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన విజయాలను ప్రచార యంత్రాంగం ద్వారా నిరంతరం ప్రజలకు చూపిస్తూ వస్తోంది. అయితే తొలిసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ నెరవేరకపోవడం, రైతుల ఆదాయం రెట్టింపు కాలేకపోవడం, వరుసగా పరీక్షా పేపర్ లీకులు జరగడం వంటి వైఫల్యాలను యువత మర్చిపోవడం లేదని రాజ్‌దీప్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా మీమ్స్ యువత భాషగా మారాయనీ, రాజకీయ వ్యంగ్యం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆయుధంగా ఎదిగిందని వివరించారు. టీవీ చర్చలు, ప్రతిపక్ష విమర్శలను కూడా భరించలేని మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు హాస్యం, వ్యంగ్యాన్ని కూడా తట్టుకోలేకపోతోందనీ, వీటి కట్టడికి యోచిస్తోందని, ఇందుకు అనేక మార్గాలను అన్వేషిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంప్రదాయ రాజకీయాలకు నో
యువ ఓటర్లు ఇప్పుడు సంప్రదాయ రాజకీయాల కంటే కొత్తదనం,
నిజాయితీని కోరుకుంటున్నారనీ,
ఇందుకు తమిళనాడులో విజయ్‌కు యువత నుంచి లభించిన ఆదరణే ప్రత్యక్ష ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం.. తాను ఏది చేసినా చెల్లుతుందనే భావనతో తమ వ్యతిరేకులపై దేశద్రోహం వంటి కఠిన చట్టాలను ప్రయోగించడానికి కూడా వెనకాడదని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శకు చోటు లేనప్పుడే… యువత తిరుగుబాటు కొత్త రూపాల్లో బయటపడుతుందని చెప్తున్నారు.



